బాలయ్య: చిన్నక్కా, చిన్నక్కా
ఏకాంబరం: ఏం బాలయ్య చాలా హుషారుగా వచ్చావు, చిన్నక్క కాసేపట్లో వస్తానందిలే
బాలయ్య: ఇప్పుడు ఆకాశవాణి వారి ప్రసారాలు రేడియోలోనే కాకుండా, కంప్యూటర్ లో కూడా వినొచ్చని విన్నాను
ఏకాంబరం: ఆ మాటకొస్తే మొబైల్లో కూడా వినొచ్చు తెలుసా
బాలయ్య: ఎలా వినాలి, మన హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారాలు వినొచ్చా
ఏకాంబరం: ఓ భేషుగ్గా, ఆలిండియా రేడియో వెబ్సైట్లో తెలుగుతో పాటు, ఇతర భాషా ప్రసారాలు కూడా వినవచ్చు. ఇది వారి వెబ్సైట్.
బాలయ్య: ఆ “లిసన్ లైవ్” అని రేడియో స్పీకర్ కనిపిస్తోంది.
ఏకాంబరం: ఆ పక్కన కనబడే లింకులమీద నొక్కితే ఆ భాషలో వినవచ్చు.
బాలయ్య: చాలా మంచి విషయం చెప్పావు ఏకాంబరం.
ఏకాంబరం: అప్పుడే ఏమైంది, ఆ పైన “రాగం” అన్న ఛానెల్ వున్నది చూశావు, దాంట్లో 24 గంటలు సంగీతమే సంగీతం ఏకధాటిగా.
బాలయ్య: అంటే కర్ణాటక సంగీతమా
ఏకాంబరం: ఒక్క కర్ణాటకమేమిటి దానితోపాటు హిందూస్థానీ, భక్తి గీతాలు, అటు ఓకల్ ఇటు ఇన్స్ట్రుమెంటల్ కూడానూ.
బాలయ్య: అంటే ప్రముఖ విద్వాంసుల కచేరీలన్నీ వినవచ్చా
ఏకాంబరం: సంతోషంగా వినవచ్చు. ప్రతి గంట గంటకు కొత్త ప్రోగ్రామ్ మొదలవుతుంది.
బాలయ్య: మరి మనకు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో ఎలా తెలుస్తుంది.
ఏకాంబరం: అక్కడే వచ్చింది తంటా అంతా.
బాలయ్య: అంటే ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వస్తుందాని, గోతికాడనక్కలాగా కూచోవాలంటావా, మన చిన్నక్కకు ఏమన్నా తెలుసంటావా
చిన్నక్క: ఏం ఏకాంబరం, ఏదో అక్క-నక్క అంటున్నాడు బాలయ్య.
ఏకాంబరం: రా రా చిన్నక్కా, రాగం ఛానెల్లో ఏ ప్రసారం ఎప్పుడు వస్తుంది ఎలా తెలుసుకోవటం అని బాలయ్య అడుగుతుంటే సమయానికి నువ్వు వచ్చావు.
చిన్నక్క: రాగం ఛానెల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ బెంగుళూరు ఆకాశవాణి వెబ్సైట్లో లభిస్తోంది. ఇక్కడ ఏరోజుకారోజు రాత్రి 12 తరువాత ప్రోగ్రామ్ షెడ్యూల్ పెడతారు.
ఏకాంబరం: అంటే దానివల్ల మనం ముందే మనం వినదలచుకున్న ప్రోగ్రామ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట.
బాలయ్య: అంటే చిన్నక్కా వాళ్ళు వేయబోయే కీర్తనలు కూడా ముందే తెలుస్తాయా
చిన్నక్క: అవును బాలయ్యా, కరెక్టుగా అడిగావు
ఏకాంబరం: ఇంకేం సెల్ఫోన్లో అలారం పెట్టుకొని, మర్చిపోకుండా మరీ వినొచ్చు.
చిన్నక్క: ఈ మధ్య మన రజని గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి” కూడా రాగం ఛానెల్ లో ప్రసారం అయింది తెలుసా. రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని కేంద్రాలు, వంతుల వారీగా వారి వారి కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి.
బాలయ్య: పునః ప్రసారం కూడా అవుతాయా ఏకాంబరం.
ఏకాంబరం: నిక్షేపంగా. అది సరే కానీ చిన్నక్కా ఈ మధ్య అనేక ప్రైవేట్ రేడియోలు కూడా వచ్చాయి కదా, మరి అవి ఎలా వినాలి.
బాలయ్య: ఏముంది వారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వినటమే
ఏకాంబరం: ఎన్ని యాపులని డౌన్లోడ్ చేస్తాం
చిన్నక్క: అవేమీ అవసరం లేదు. ఇదిగో ఈ వెబ్సైట్ చూశారా, ఇక్కడ ఎన్ని రేడియోలు కనబడుతున్నాయో. మీకు కావలసిన రేడియో మీద క్లిక్ చేస్తే చాలు ప్లేయర్, వెనువెంటనే పాట వస్తాయి.
బాలయ్య: ఇక్కడ మన ఆకాశవాణి కూడా వుంది.
ఏకాంబరం: అంటే చిన్నక్క యాప్ అవసరం లేకుండా బ్రౌసర్ లో ఓపెన్ చేసి వినవచ్చన్నమాట.
చిన్నక్క: అంతే కదా ఏకాంబరం
బాలయ్య: ఏకాంబరం నువ్వు గమనించావో లేదో ఇక్కడ కూడా చాలా భాషల్లో వినవచ్చు.
చిన్నక్క: అంతాబానే వుంది కానీ బాలయ్యా, మరి మనకు నచ్చిన ప్రోగ్రాం రికార్డు చేసుకోవటానికి అవకాశం వుందా.
ఏకాంబరం: ఆ విషయం నన్నడగండి చెబుతాను. “Audacity” అన్న ఫ్రీ software దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి
చిన్నక్క: ఎలా రికార్డు చెయ్యాలి
ఏకాంబరం: ఈ “రెడ్ కలర్” బటన్ నొక్కితే చాలు, ఆపాలంటే “ఎల్లో కలర్” బటన్ నొక్కాలి. కంప్యూటర్ లోంచి రికార్డు చేస్తుంటే “స్టీరియో మిక్స్” మోడ్ సెలక్ట్ చెయ్యాలి, అక్కరలేదనుకున్న రికార్డు మొదట్లోగాని, చివర్లోగాని అదిగో ఆ పైన కనిపిస్తున్న కత్తెరతో కట్ చేస్తే సరి.
చిన్నక్క: అవును అదేదో m p 3 అంటారు
ఏకాంబరం: ఉండు నీకు ఒకటే తొందర, ఇక్కడ చూశావా దీన్ని ఇలా “8000” లో రికార్డు చేసేటప్పుడు పెట్టుకుంటే చిన్న ఫైల్ గా రికార్డు చేసుకోవచ్చు.
చిన్నక్క: నేనడిగింది మటుకు చెప్పలా
ఏకాంబరం: ఇదిగో ఇలా ఫైల్లోకి వెళ్ళి “ఎక్స్ పోర్ట్” నొక్కి, ఫైలుకు పేరు పెట్టుకొని, ఎక్కడ సేవ్ చెయ్యాలో ఆజ్ఞ ఇస్తే, అక్కడ m p3 ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. చిన్నపాటి రికార్డింగ్ పరిజ్ఞానం వుంటే, ముందుగా నచ్చిన ప్రోగ్రామ్ మొత్తం రికార్డు చేసుకొని, సేవ్ చేసుకొని, తర్వాత దాన్ని పాట/ కీర్తన వారీగా mp3 లోకి మార్చుకోవచ్చు.
బాలయ్య: చాలా మంచి విషయం చెప్పావు ఏకాంబరం. ఇక మంచి మంచి ప్రోగ్రామ్స్ రికార్డు చేసుకొని ఎంచక్కా వినొచ్చు.
చిన్నక్క: అంతే కాదు బాలయ్యా, మన సేకరణను నలుగురితో చక్కగా పంచుకోవచ్చు కూడానూ.
ఏకాంబరం: ఇక వుందాము, ఇప్పటికే చాలా సమయాభావం అయింది.
చిన్నక్క: మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
Tags: All India Radio, Akashavani, Ragam, Online Radio, Radio Recording, AIR Hyderabad, Ragam Schedule
Tags: All India Radio, Akashavani, Ragam, Online Radio, Radio Recording, AIR Hyderabad, Ragam Schedule