పేరులో ఏముంది పెన్నిధి, అనుకుంటారేమోగాని ఉన్నదంతా పేరులోనే ఉన్నది. ఇంటిపేరు నిలబెట్టాలని పెద్దవాళ్ళు అంటారుకాని, ముందు మనపేరు నిలబెట్టుకొనే ప్రయత్నంచేస్తే ఇంటిపేరు అదే నిలబడుతుంది. ఇప్పుడంటే పిల్లలకు పేర్లు పెట్టటానికి నానా తంటాలూ పడుతున్నారు కానీ ఇదివరలో ఆ ఇబ్బంది అట్టేలేదు. ఒకరి పేరు అతని ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుందా అంటే, కొంతమంది విషయంలో చూపించి ఉండవచ్చు. దేవుడి పేరు పెట్టుకొని ఎన్ని తప్పులు చేసినా నడుస్తుంది కానీ, ఒక గొప్పవ్యక్తి పేరు పెట్టుకొని, ఆ పేరుకు మచ్చతెస్తే ఎవరూ హర్షించలేరు. కొన్ని పేర్లు పెట్టుకుంటేనే వారు గొప్పవారు అవుతారా అంటే, ఎందుకవరు ఆ పేరు ప్రభావంతోనే వారు సంఘంలో గొప్ప వ్యక్తులుగా తారసిల్లుతారు. ఉదాహరణకు సుబ్బారావు అన్నపేరు ఈ రోజుల్లో పాతచింతకాయ పచ్చడిలాగా అనిపించవచ్చు. కానీ సుబ్బారావు అన్నపేరు పెట్టుకోవటంవల్ల మనతెలుగువారిలో ఎంతోమంది గొప్పవారయిపోయారు. రాయప్రోలు, గోవిందరాజుల, నండూరి (భావకవి), నండూరి (రేడియో), ఆదుర్తి, చక్రపాణి, బుచ్చిబాబు ఇలా ఎంతోమంది గొప్పవారు అవటానికి కారణం వారి పేరు చివరలోవున్న ‘సుబ్బారావు’ అన్న నామధేయమే అనటంలో ఎటువంటి సందేహంలేదు . మధ్యలో ‘వెంకట’ కనక ఉంటే ఇక తిరుగేలేదు. కావాలంటే సుప్రసిద్ధ హాస్య రచయిత శ్రీరమణ గారు రాసిన “సుప్రసిద్ధ సుబ్బారావులు” అన్న ఈ వ్యాసం చూడండి, ఓపిగ్గా లెక్క పెడితే దగ్గరదగ్గర యాభైమంది సుబ్బారావులు తేలారు. ఏది ఏమయినా ఇది ఆలోచించవలసిన విషయం.
 |
Source: Maha News |
Tags: Sriramana