Thursday, December 14, 2017

నాటి బ్రిటిష్ వారి దుబాసీ ‘కావలి వెంకట బొఱ్ఱయ్య’

నాటి బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో మనదేశంలో మొదటి సర్వేయర్ జనరలుగా పనిచేసిన ప్రముఖ వ్యక్తి కల్నల్ మెకంజీ (1754 – 1821). బ్రిటిష్ వారికింద పనిచేసేవారిని దుబాసీగా వ్యవహరించేవారు. మెకంజీ కింద ముగ్గురు సోదరులు పనిచేశారు. వారిని కావలి సోదరులు అనేవారు. వారిలో ప్రముఖులు కావలి బొఱ్ఱయ్య గారు (1776- 1803), మిగతా సోదరుల పేర్లు వెంకట రామస్వామి, వెంకట లక్ష్మయ్య. మెకంజీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్న 1816 నాటి తైలవర్ణ చిత్రము ఒకటి అంతర్జాలంలో విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఆ ముగ్గురు వ్యక్తులు కావలి సోదరులని కొంతమంది పేర్కొనటం జరిగింది. ఆ చిత్రం కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. దాంట్లో ఉన్నది కావలి వెంకట లక్ష్మయ్య మాత్రమే, మిగతా ఇద్దరు వేరేవారు. 
 
Source: http://blogs.bl.uk/asian-and-african/2017/08/colin-mackenzie-collector-extraordinare-.html#

Source: http://www.bl.uk/eblj/1991articles/pdf/article10.pdf?_ga=2.7248818.1078764670.1513233433-1588881989.1513233433 


విశేషం ఏమిటంటే ఈ చిత్రం జూన్ 1834 నాటి “The Saturday Magazine” ముఖచిత్రంగా ప్రచురించారు. 
 
Source: http://berghahnbooks.com/downloads/intros/WolffhardtUnearthing_intro.pdf

విషయానికి వస్తే కావలి వెంకట రామస్వామి గారు “Biographical Sketches Of Dekkan Poets” అన్న పుస్తకం ఒకటి ఆంగ్లంలో రాశారు. 1829నాటి ప్రచురణ ఒకటి అంతర్జాలంలో లభిస్తోంది. దాంట్లో వారి సోదరుడు కావలి బొఱ్ఱయ్య గురించి కూడా రాశారు. 

దాని అనువాదం ఒకటి 1937 నాటి ఆంధ్రభూమిలో ప్రచురించారు. ఆ వ్యాసం ఇప్పుడు చూద్దాము. బొఱ్ఱయ్యగారు మెకంజీ కలిసిపనిచేసింది ఏడు సంవత్సరాలే. కానీ ఆ కొద్దికాలంలో వారు సల్పినకృషి విశేషమైనది. వారు 26ఏళ్లకే చనిపోయారు. ఈ వివరాలన్నీ ఈ వ్యాసంలో లభిస్తాయి. 

వెంకట రామస్వామి గారు ఆంగ్లంలో రాసిన మరొక పుస్తకం “Viswaguna Darsana”, 1825 నాటి ఈ ప్రతి గూడా అంతర్జాలలో లభిస్తోంది. 

మెకంజీ తన హయాములో దక్షిణ భారతదేశంలో విశేషమైన వస్తుసంపద సేకరించారు. వీటిల్లో పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు, శిల్పాలు, నాణేలు, చిత్రాలు, మ్యాపులు, సర్వే రిపోర్టులు అనేకానేకాలు ఉన్నాయి. వీరు కలకత్తాకు బదిలీ అయినప్పుడు వీటిని ఒడలో మద్రాసు నుంచి కలకత్తా తరలించారుట. ఆయన మరణానంతరం వాటిని బ్రిటిష్ మ్యూజియంకు తరలించారుట. మెకంజీ సేకరణ మొత్తానికి ఒక కేటలాగు తయారు చేశారు. దీని తయారీలో వెంకట లక్ష్మయ్య గారు సహకరించారుట. 661 పుటలు ఉన్న ఈ కేటలాగు కూడా అంతర్జాలంలో లభిస్తోంది. దీన్ని చూస్తే ఎంత సంపద కొల్లగొట్టుకు పోయారో అర్థం అవుతుంది.  
 మరింత  సమాచారం కొరకు 
 http://www.jenniferhowes.com/mso-chp-3.pdf

 http://www.jenniferhowes.com/illustrated-jaina-collectio.pdf


Tags: Kavali Borrayya, Kavali Borraiah, Kavali brothers, Colin Mackenzie

Saturday, December 9, 2017

నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు

ప్రపంచ తెలుగు మహాసభల తరుణంలో నాటి “నిజాము రాష్ట్రమున ఆంధ్ర పత్రికలు” అన్న వ్యాసం చూద్దాము. ఇది “విభూతి” అన్న 1939 నాటి సంచికలో వచ్చింది. ఇలాంటి వ్యాసాలవల్ల ఆనాటి తెలుగు పత్రికల తీరు తెన్నులు తెలిసే అవకాశం వుంటుంది. 


1926 నాటి “ఆంధ్రపత్రిక”లో వచ్చిన “గోలకొండ పత్రిక”  ప్రకటన 


1925 నాటి “శారద” వారపత్రికలో వచ్చిన “నీలగిరి పత్రిక” ప్రకటన “ఆంధ్ర పత్రిక” 1914 నాటి సంచికలో మాడపాటి హనుమంతరావు గారి “నిజాము రాష్ట్రములోని ఆంధ్రులు” అన్న వ్యాసం ఒకటి ప్రచురించారు. అలాగే శ్రీపాద వారి “ప్రబుద్ధాంధ్ర” నవంబర్ 1934 సంచికలో లో సురవరము వారి “నిజాము రాజ్యములోని తెలుగు వారి స్థితి” అన్న వ్యాసం వచ్చింది. గడియారం రామకృష్ణ శర్మ గారి “సుజాత” సంచికలో మల్లంపల్లి వారి “తెలంగానా చరిత్ర” అన్న 21 పుటల వ్యాసం ప్రచురించారు. 
“ఆంధ్ర పత్రిక” వారు “హైదరాబాద్ విమోచన దినోత్సవ సంచిక” అన్న ప్రత్యేక సంచిక ప్రచురించారు. 


వీటివల్ల ఆనాటి చరిత్ర, స్థితిగతులు తెలుసుకొనే అవకాశం వుంటుంది. నీలగిరి పత్రిక ఆనవాళ్ళు కూడా లభించటం లేదు. ఒకేసారి రెండు జిల్లాలనుండి రెండు నీలగిరి పత్రికలు వెలువడినట్లు తెలుస్తోంది. అయితే నీలగిరి పత్రికాధిపతి  చిత్రం లభించింది. బహుశా వీరు “షబ్నవీసు వేంకటరామ నరసింహారావు” గారు అయివుండాలి. నల్లగొండ జిల్లాను “నీలగిరి” జిల్లా కింద మార్చాలని ప్రతిపాదన కూడా వచ్చింది. మొత్తం మీద లభిస్తున్న వ్యాసాల వల్ల తెలంగాణాలో ఈ కింది పత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. 

హితబోధిని 1913, ఆంధ్ర మాత 1917, నీలగిరి 1922, తెలుగు వార పత్రిక 1922, ఆంధ్రాభ్యుదయము 1925, గోలకొండ పత్రిక 1925, నేడు పత్రిక 1925, దేశబంధు 1926, శైవమత ప్రచారిణి పత్రిక 1926, సుజాత 1927, భాగ్యనగర్ పత్రిక 1931, దక్కన్ కేసరి 1934, ఆంధ్ర కేసరి (లిఖిత పత్రిక) 1937, దివ్యవాణి 1937, తెలుగుతల్లి 1941, తెలంగాణా పత్రిక 1941, తరణి 1942, శోభ (దేవులపల్లి రామానుజ రావు గారిది) 1947, కాకతీయ పత్రిక 1944, ఆంధ్రశ్రీ 1944, భాగ్యనగర్ 1949, వెలుగు, స్వతంత్ర, సాహిత్య ఆంధ్రకేసరి, బాలసరస్వతి, పూలతోట, ప్రత్యూష. 

1947లో వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో బి. ఇంద్రసేన రెడ్డి అనే ఆయన “గ్రామజ్యోతి” అనే గోడపత్రికను నడిపారుట. ఏరోజుకారోజు గోడలమీద ఆనాటి వార్తలు రాసేవారుట. 

లభిస్తున్న కొన్ని పత్రికల ముఖచిత్రాలు 

Tags:  Telugu old Periodicals

Thursday, December 7, 2017

ఆంధ్ర విశ్వకళాపరిషత్

ఆంధ్ర యూనివర్శిటి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరగబోతున్న తరుణంలో, ఒక్కసారి అలా గతంలోకి వెళితే, మొదట ఈ విశ్వవిద్యాలయమును బెజవాడలో 1926లో నెలకొల్పారు. అయితే ఈ విశ్వవిద్యాలయమును గుంటూరులో పెట్టాలని, కాదు బెజవాడలో పెట్టాలని చాలా వాడివేడి చర్చ జరిగింది. దీనిగురించి అనేక వ్యాసాలు నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 1926 నాటికే అటు గుంటూరులో అరండల్ పేట, బ్రాడీపేట ఇటు బెజవాడలో గవర్నరుపేట, గాంధీనగర్ ఏర్పడ్డాయి. నాటి బెజవాడ జనాభా యాభైవేలు. బెజవాడ పురపాలక సంఘం వారు 100 ఎకరాలు 2 లక్షలకు కొని విశ్వవిద్యాలయమునకు ఇచ్చుటకు తీర్మానంగూడ చేశారు. చిలుకూరి నారాయణరావు గారు విశ్వవిద్యాలయములో తెనుగును ప్రధాన భాషగా చేయాలని ప్రసంగాలు చేశారు. కట్టమంచివారు విశ్వవిద్యాలయమునకు మొదటి ఉపకులపతిగా తదుపరి సర్వేపల్లి వారు పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయము చిహ్నమును ప్రముఖ చిత్రకారులు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారు (1906-1976) శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి సూచనమేరకు చిత్రీకరించారు. ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ సూరి భగవంతంగారు కట్టమంచి వారి కోరికమేరకు ఈ విశ్వవిద్యాలయ కళాశాలలో పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో విశ్వవిద్యాలయమును గుంటూరుకు తరలించారు. ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఈ విశ్వవిద్యాలయమునకు సేవలు అందించారు, అలాగే ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఉన్నత శిఖరాలు అధిరోహించారు. “కళాప్రపూర్ణ” బిరుదంతో ఈ విశ్వవిద్యాలయము ఎంతోమంది ప్రముఖులను సన్మానించింది. 

Source: The Hindu

part of the article - Andhra Parika 22nd May 1926
Tags: Andhra University