Friday, May 27, 2016

గ్రామఫోన్ రికార్డుల ప్రకటనలు, పాటలు

శ్రీశ్రీ గారు “కాదేదీ కవితకు అనర్హం” అన్నట్లుగా ఆసక్తి ఉండి పరిశోధన జరపాలేగాని సినిమాపాటలు, గ్రామఫోన్ పాటలు, సినిమా పోస్టర్స్ లాంటి అనేక అంశాలను తీసుకుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు, పుస్తకాలు, రికార్డులు, చిత్రాలు, ఫోటోలు, క్యాటలాగులు, వాటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల సమాచారం, వాటిమీద పరిశోధన చేసేవారికి ఎంతో ఉపయుక్తంగా వుంటాయి. వారివారి ఆసక్తినిబట్టి ఎంతోమంది అజ్ఞాతంగా ఎంతో సేకరణ, పరిశోధన చేస్తూవుంటారు. శ్రీ వి. ఎ. కె. రంగారావు గారి దగ్గర 40వేల దాకా ఎల్.పి. రికార్డులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. పైడిపాల గారు “తెలుగు సినిమాపాట” అన్న అంశంపై పి.హెచ్.డి. కోసం సిద్ధాంత గ్రంధమే సమర్పించారు. 


సోర్స్: బ్రిటిష్ లైబ్రరీ     
మనలో చాలామందికి పాతసినిమాలు, పాటలు వాటికి సంబధించిన విషయాలమీద ఆసక్తి వుంటుంది. కానీ ఎవరన్నా కష్టపడి గ్రామఫోన్ పాటలను సి.డి.గా పట్టుకు వస్తే 100రూపాయలపెట్టి కొనటానికి ఆలోచిస్తాము. అలాకొంటే అదివారికి మరింత ప్రోత్సాహకరంగా వుండి మరిన్ని వెలుగులోకి తేవటానికి అవకాశం వుంటుంది. ఇంతకుముందు రెండుసార్లు గ్రామఫోన్ రికార్డుల ప్రకటనలు పోస్ట్ చెయ్యటం జరిగింది. 


ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు చూద్దాము. ఇప్పుడు ఈ ప్రకటనలకు విలువ ఏముంటుంది అనుకోవచ్చు. కాని వీటి చరిత్రను అధ్యయనం చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇకవేళ రికార్డుల మీది వివరాలు చెరిగిపోయినప్పుడు రికార్డుల క్యాటలాగులు లభ్యం కాకపోతే ఈ ప్రకటనల వల్ల రికార్డు నెంబరు, పాట వివరాలు, పాడిన వారి సమాచారం, విడుదలైన సంవత్సరం, వారి ఫోటోలు లాంటివి తెలుసుకోవచ్చు. పాత రికార్డు యొక్క ఫోటో ఏదన్నా సంచికలో ప్రచురిస్తే మనకు ఆసక్తి కలగటం సహజం. ఆ రోజులలో కానీండి, ఇప్పుడు కానియ్యండి రికార్డులలోని ఇతరత్రా ధ్వనుల కారణంగా పాటలోని సాహిత్యాని ఒక్కోసారి ఆస్వాదించటం కుదరక పోవచ్చు. అందుకని ఆరోజుల్లో ఈ గ్రామఫోన్ పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. ఈ కింది ఉపోద్ఘాతముతో ఆ విషయం తెలుస్తోంది. ఓ మూడు పాటల పుస్తకాల ముఖచిత్రాలు కూడా చూద్దాము. 


ఇంతకు ముందు నెట్లో గ్రామఫోన్ పాటలు ఎక్కడ లభ్యం అవుతాయో తెలుపుతూ ఒక పోస్టింగ్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు మరొక వెబ్సైటు చూద్దాము. ఇది బ్రిటిష్ లైబ్రరి వారిది. ఆ వెబ్సైటు అడ్రసు ఇది. కావాలని లింకు ఇవ్వలేదు. ఇది కాపీ చేసుకొని మీ బ్రౌజరు లో పేస్టు చేసుకొని చూడవచ్చు. ఇక్కడ చాలా పాత రికార్డులు వినవచ్చు. 

http://sounds.bl.uk/World-and-traditional-music/Odeon-record-label-collection

ఈ కింద కనబడే వివరాల ద్వారా అక్కడ లభించే ఇతర లింకుల ద్వారా మీమీ ఆసక్తిని బట్టి ఆ లింకుల మీద క్లిక్ చేసి పాటలు వినవచ్చు. 


ఇలా వినబడుతూ డౌన్లోడ్ చేసుకోవటానికి వీలులేని పాటలను మన కంప్యూటర్ లో ఎలా ఒడిసిపట్టుకొని సేవ్ చేసుకోవాలో మరోసందర్భంలో చూద్దాము. 


Tags: Telugu Gramophone songs, Gramophone advertisements, Old Gramophone records,

2 comments:

 1. అన్నీ మనకు ఇంటర్నెట్లో ఫ్రీగా లభించాలని ఆశిస్తాము. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా, ఈ అత్యాశమూలంగా ఒక వెబ్సైట్మా యమైపోయింది.

  బాగా చెప్పారు. ఇలా మీరు కష్టపడి లింకులు ఇవ్వటం వల్ల ఆయా వెబ్సైట్ల మీద మందలు మందలు పడి దోచుకుంటున్నారు. ఆ వెబ్సైటు వాళ్ళు కూడా పాటకు ఇంత అని పెట్టాలి. లేదా మంచి (ప్రతి చెత్తా కాదు) వ్యాపార ప్రకటనలు తగు మాత్రమె తీసుకుని వాళ్లకు అయ్యే ఖర్చులు గిట్టేట్టుగా చేసుకోవాలి.

  ReplyDelete
 2. మీరు ఈ అరుదైన రికార్డుల చిత్రాల మరిన్ని ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నారు
  మీరు పరిచయం చేసిన సైట్ కూడా బావుంది
  మీరు చెప్పినట్లు సైట్ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, అలా మంచి మంచి సైట్లు పోయాయి
  మ్యూజికాలయ,ఎపిటాకీస్ వంటి సైట్లు
  ఇప్పుడు మీ బ్లాగు ఎంతో మేలు చేస్తుంది
  ధన్యవాదములు

  ReplyDelete