ఈనాడు మనకు “ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ” వారివల్ల లభిస్తున్న అలనాటి పాతసంచికలు చాలావరకు ఈ “సారస్వతనికేతనం” పుణ్యఫలమే. ఈ గ్రంధాలయం 15 అక్టోబర్ 1918లో స్థాపించబడింది. వచ్చే ఏడాదికి వంద వసంతాలు పూర్తవుతాయి. ప్రకాశం జిల్లాలోని చీరాలకు సమీపంలో ఉన్నది వేటపాలెం. దీని వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ ఊటుకూరి వేంకట సుబ్రాయ శ్రేష్ఠి గారు. మొదట ఇది “హిందూ యువజన సంఘం” కింద ఏర్పాటు అయింది. వీరు ఈ గ్రంధాలయం ఏర్పాటుకు 1924లో పెంకుటింటిని కూడా సమకూర్చారు. దీనిని అప్పట్లో శ్రీ జమన్లాల్ బజాజ్ గారు ప్రారంభించారు. 1929లో నూతన భవనానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు పునాదిరాయి వేస్తే, ప్రకాశం పంతులు గారి చేతులమీదుగా నూతన భవనం ప్రారంభం అయింది. 1935లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ గ్రంధాలయాన్ని దర్శించి దీనిని ఒక దేవాలయమునకు ప్రతీకగా, గ్రంధాలయం ఆవరణలో ద్వజస్తంభం ప్రతిష్టించారు. 1936లో గాంధీ గారు మరొకమారు ఈ గ్రంధాలయాన్ని దర్శించారు, గుర్తుగా వారి చేతికర్రను ఇక్కడ భద్రపరిచారు. ఎన్నో సభలకు, సమావేశాలకు ఆలవాలము ఈ గ్రంధాలయము. ఎంతో మంది కవులు, రచయితలు, విశిష్ఠ వ్యక్తులు ఈ గ్రంధాలయాన్ని సందర్శించారు. వంద సంవత్సరాల కిందటి వార్తాపత్రికలు, కొన్ని వేల పుస్తకాలు, సంచికలు, అరుదైన తాళపత్ర గ్రంధాలు ఇక్కడ భద్రపరచబడ్డాయి. నాడు ఎంతో దూరదృష్టితో సుబ్రాయ శ్రేష్ఠి గారు చేసిన చిన్న ప్రయత్నం ఈనాడు సరస్వతీనిలయంగా విరాజిల్లుతోంది.
|
జమన్లాల్ బజాజ్ |
Tags: Saraswathanikethanam, Vetapalem