Monday, June 12, 2017

సినారె ఛలోక్తులు

శ్రీ సి. నారాయణరెడ్డి గారి ఛలోక్తులు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవి శ్రీ ఎన్. గోపి గారి సంపాదకత్వంలో వచ్చిన “సినారె ఛలోక్తులు” అన్న పుస్తకంనుండి గ్రహించటం జరిగింది.



ఓ రోజు డ్రాయింగ్ రూములో ఒకతను సినారె ముందు కుర్చీలో కూచోని హావభావవిన్యాసాల్తో సినారెను పొగుడుతున్నాడు. అతను వెళ్లిపోయాక సినారె మిత్రుడు “ఎవరండీ అతను?” అని అడిగాడు. సమాధానంగా సినారె పైకి చూపించారు. పైన సీలింగ్ ఫ్యాను తిరుగుతోంది. అంటే అతడు సినారె Fan అన్నమాట. – డా. ఎన్. గోపి 

ఒకసారి సినారెని కలవటానికి ఒక విద్వాంసుడైన నియోగి ప్రముఖుడు, ఆయనతోపాటు ఓ వ్యాకరణవేత్త వచ్చారు. ఇద్దరు సినారెకు ఆత్మీయులు. ఇద్దరూ కాసేపు మాట్లాడి సెలవుతీసుకొని స్కూటరు మీద కూర్చున్నారు. అప్పుడు వాళ్ళిద్దరును ముచ్చటగా చూస్తూ “బాగుంది ఈ జంట, ముందు కరణం వెనక వ్యాకరణం” అని ఆప్యాయత చిలకరిస్తూ ఛలోక్తి విసిరారు. – ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 

ఒక మిత్రుడు నారాయణరెడ్డిగారితో అన్నాడు “మా నాన్నగారు చరిత్ర బోధించే టీచరుగా పనిచేశారు. నేను కూడా చరిత్ర మాష్టారుగానే పనిచేస్తున్నాను”, వెంటనే సినారె “హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్” అని ఛలోక్తి విసిరారు. – డా. జె. బాపురెడ్డి 

రవీంద్రభారతిలో సినారె రచించిన ‘మాటలో ఏముంది నా పాటలో ఏముంది’ గ్రంధావిష్కరణ సభ. పాత సినిమాల్లో పాటల చిత్రీకరణ గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావిస్తూ “ఆనాటి సినిమాల్లో అవసరమైతేనే బృందగానాలుండేవి. మరి ఇప్పుడు బృందగానాలు కాదు మందగానాల స్థాయికి వెళ్లిపోయాయి” అన్నారు. సభలో గొల్లున నవ్వులు. – డా. జె. చెన్నయ్య 

ఒకసారి పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు నారాయణరెడ్డిగారితో ‘ఏమండీ మీ ఆత్మకధ రాయకూడదూ ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తాను’ అన్నారుట. దానికి నారాయణరెడ్డి గారు నవ్వుతూ “ఎక్కడండీ! ఎప్పుడెలా కుదుర్తుంది, పనిముట్లుడిగిన తర్వాత రాస్తానులెండి” అన్నారుట. “పనిముట్లు” మాటలోని కొంటె అర్ధానికి పురాణం, పురాణం మార్కు నవ్వుతో గలగలమన్నారుట. – డా. ఎన్. గోపి 

సంగీత దర్శకుడు పెండ్యాల గారికి సన్మాన సభ జరుగుతోంది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. సన్మానకర్త. ఆ సభలో పాల్గొన్న నారాయణరెడ్డిగారు ప్రసంగిస్తూ “సినిమా పాటల్లో మూడురకాలున్నాయి. పాత సినిమాల్లోనైతే నిలబడే పాటలుండేవి. ఆ తర్వాతి కాలంలో నడిచే పాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో దొర్లిపడే పాటలూ ఎదురవుతున్నాయి” అని చమత్కరించారు. సభలో నవ్వులే నవ్వులు. – టి. వేణుగోపాలరెడ్డి 


చివరగా ‘తూర్పుపడమర’ సినిమానుండి నారాయణరెడ్డి గారి స్వరంలో 

..



Tags: Cinare, C. Narayana Reddy  

No comments:

Post a Comment