పూర్వకవులు పద్యాలను ఒక ఆకృతిలో ఇమిడేటట్లుగా కూర్చేవారు. పద్మ బంధము, పుష్పమాలా బంధము, రధ బంధము అలాంటి కోవకు చెందినవే. ముందుగా విభిన్న ఆకృతులు గీసుకొని సంధర్భానుసారంగా దాంట్లో ఇమిడేటట్లుగా, ఒక అర్ధం ఇనుమడించేలా వాక్యాన్నో, ఆశీస్సులనో, కవి పేరునో చొప్పించి దాన్ని చూట్టూ పద్యాన్ని అల్లుతారు. మళ్ళీ ఆ పద్యం యొక్క లక్షణానికి (సీస పద్యము, ఆటవెలది) తగ్గట్లుగా పద్యం సమకూర్చాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియలా అనిపిస్తుంది. బహుశ అష్టావధానం చేసేవాళ్ళకు ఇది వెన్నతో పెట్టిన విద్య లాంటిది. పద్యం నడత గూడా విభిన్నంగా పైనుంచి కిందకు తిరిగి కిందనుంచి పైకి, కుడినుంచి ఎడమకు తిరిగి ఎడమనుంచి కుడికి సాగుతుంది. అలాంటి పద్య బంధాలను కింద చూడండి. ముందుగా పద్యాన్ని చదివి ఆ పద్యం ఆ బంధం లో ఎలా సాగుతోందో గమనించండి. చివరగా ఆ బంధంలో ఏర్పడ్డ వాక్యాన్ని వీక్షించండి .
ఇంతకీ ఈ పద్య బంధములు ఎక్కడివన్న విషయానికి వస్తే, 1928లో దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారి (ఆంధ్ర పత్రిక) కుమార్తె కామాక్షి గారికి శివలెంక శంభు ప్రసాద్ గారికి జరిగిన వివాహమహోత్సవ సమయమున వధూవరులకు దాదాపు ఒక 80 మంది కవి పండితులు సమర్పించిన అభినందన ఆశీస్సులను “కామాక్షి కళ్యాణము” అను పేరిట ప్రచురించిన పుస్తకంలోనివి.
అలాగే గృహలక్ష్మి సంచికలో
ప్రచురితమైన పుష్పమాలికా బంధం గూడా ఒకటి చూడండి.