Tuesday, January 3, 2017

1933 నాటి తెలుగు టాకీ – సావిత్రి – పూర్వాపరాలు

గత నాలుగుఏళ్లుగా విభిన్నాంశాలతో సాగుతున్న శోభనాచలారోహణంలో ఇవాళ 700వ మెట్టుకు చేరుకున్నాము. తిరుపతి వేంకటకవుల శిష్యులు, 1933 లో ‘సావిత్రి’ సినిమాగా తీయబడ్డ ‘సావిత్రి’ నాటకకర్త, స్వయానా మాతాతగారు అయిన శ్రీ శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారి గురించిన కొన్ని జ్నాపకాలను పదిలపరచే ప్రయత్నంలో భాగమే ఈ 700వ పోస్టింగ్. 


మాతాతగారు 1888లో జన్మించారు.  వీరు బెజవాడ హిందూ హైస్కూలులో పండితుడిగా పనిచేశారు.

సావిత్రి నాటకాన్ని మాతాతగారు 1915లో మైలవరం రాజావారి కోరికపై వారి బాలభారతి నాటకసమాజం కోసం రచించారు. ఈ నాటకం బహుళ ప్రజాదరణపొంది, కొన్నివందలసార్లు ప్రదర్శింపబడింది. ఈ నాటకం ద్వారా ఆ నాటక సమాజానికి కూడా మంచిపేరు వచ్చింది. 


యడవల్లి సూర్యనారాయణ, కపిలవాయి రామనాధశాస్త్రి, ఉప్పులూరి సంజీవరావు, అద్దంకి శ్రీరామమూర్తి, పి. రామతిలకం, వేమూరి గగ్గయ్య, దైతా గోపాలం, గురజనాయుడు, పారుపల్లి సుబ్బారావు, నిడుముక్కల సుబ్బారావు లాంటి ఎంతోమంది ప్రముఖ రంగస్థలనటులు ఈ నాటకసమాజంవారి నాటకాలలో నటించారు. ఆ రోజుల్లో రెండు మూడు రోజుల ముందుగానే టెలిగ్రాముల ద్వారా సీట్లను రిజర్వు చేసుకొనేవారని, బెజవాడ వచ్చినవారు ఆరోజు సావిత్రి నాటకం వుందని తెలిస్తే తప్పక చూసివెళ్ళేవారని సమాచారం. ఈ నాటక సమాజానికీ మాతాతగారు వాచికనిర్ణేతగాకూడా వ్యవహరించారు. 

మా తాతగారికి గురించి, బాలభారతి నాటకసమాజము గురించి పోణంగి శ్రీరామ అప్పారావు గారి ‘తెలుగు నాటక వికాసము’, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి (సినీనటులు) గారి ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ గ్రంధాలలో ప్రచురించిన వివరాలు తెలుసుకుందాము. 
తెలుగు నాటక వికాసము


ఆంధ్ర నాటకరంగ చరిత్ర


తెలుగు నాటక వికాసము

తెలుగు నాటక వికాసము

ఆంధ్ర నాటకరంగ చరిత్ర

ఆంధ్ర నాటకరంగ చరిత్ర

ఇది 1920 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించిన సావిత్రి నాటకము యొక్క ప్రకటన. ఆ రోజుల్లోనే నాటకాల టిక్కెట్టు ధరలు ఎంత ఎక్కువగా వున్నాయో. 


ప్రముఖ కధారచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “అనుభవాలు జ్ఞాపకాలు” లో మాతాతగారి ప్రస్తావన కానవస్తుంది. వీధిలో వెళుతున్న శ్రీపాదవారిని మాతాతగారు నాటకం చూడటానికి ఆహ్వానిస్తున్న సందర్భంలో చెళ్ళపిళ్ళవారికి శ్రీపాదవారికి మధ్య జరిగిన మాటల ఘర్షణ చేతలదాకా వెళుతుంది. 

అయితే ఈ నాటకం 1915లో వ్రాసినాగాని 1923 వరకు ముద్రణకు నోచుకోలేదు. 1923 లో నరసాపురం నివాసులు శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి, హైకోర్ట్ వకీలు గారి ద్రవ్యసహాయంతో మొదటి ముద్రణ అచ్చుపడింది. 
నాటి హైదరాబాద్ ప్రధానమంత్రి మహరాజ సర్ కిషన్ ప్రసాద్ గారికి నాటక ప్రదర్శన సమయమున నాటకసమాజము తరపున మాతాతగారు సమర్పించిన పద్యములు. 

Source: Wikipedia
 https://en.wikipedia.org/wiki/Maharaja_Sir_Kishen_Pershadతెలుగు టాకీలు కొత్తగా వస్తున్న, పైగా ప్రముఖ నాటకాలను యధాతధంగా పోటాపోటీలుగా తెరకెక్కిస్తున్న రోజులవి. 1933లో ఒకే పేరుతో వచ్చిన రెండు రామదాసు సినిమాలు, రెండు సావిత్రి సినిమాలు ఇందుకు తార్కాణం. సావిత్రి ఇతివృత్తంతో విభిన్న భాషల్లో ఎన్నో రచనలు, మూకీ మరియు టాకీ సినిమాలు వచ్చాయి, అయితే మాతాతగారి సావిత్రి నాటకం ఈస్టిండియా ఫిలిం కంపెనీవారు సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో సినిమాగా తీశారు. ఈస్టిండియా వారికి, పుల్లయ్య గారికి రామదాసు సినిమా తరువాత ఇది తెలుగులో రెండవ చిత్రం. అప్పటివరకు తెలుగులో మొత్తం ఆరు టాకీలు మాత్రమే విడుదల అయినాయి. 

Source: The Hindu

1933లో భారత మూవీటోన్ వారి సావిత్రి ఫిబ్రవరి 4న విడుదల అయితే, సి. పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఈస్టిండియా ఫిలిం కంపెనీవారి సావిత్రి ఫిబ్రవరి 5న విడుదల అయింది. అయితే భారత మూవీటోన్ వారి సావిత్రి విజయం సాధించలేక పోయింది, అదే తరుణంలో పుల్లయ్య గారి సావిత్రి ఈస్టిండియా ఫిలిం కంపెనీవారికి ఆరోజుల్లోనే లక్షలు ఆర్జించి పెట్టింది. వారు వెంటనే పుల్లయ్య గారి దర్శకత్వంలో 1934లో లవకుశ సినిమా తీశారు. 
వినోదిని సంచిక నుండి


తెలుగు టాకీలలో ‘సావిత్రి’, ‘లవకుశ’ పొందిన గౌరవము, ఆర్జించిన ధనము అప్పట్లో ఇతర టాకీలకు కలుగలేదు (చంద్రిక సంచిక). ముప్పది సంవత్సరాల కిందట తెలుగులో తయారైన చిత్రాలలో ఏ చిత్రం ఎక్కువ డబ్బు సంపాదించిందని ప్రశ్నిస్తే సావిత్రి (1933), లవకుశ (1934), కృష్ణలీలలు (1935) అని చెప్పేవారు. ఈ మూడు చిత్రాలు ఆంధ్రప్రజల ఆదరాభిమానాలను విశేషంగా చూరగొన్నాయి. ఈ చిత్రాలను ఒక్కొక్కరు పది, పన్నెండుసార్లు చూడగలిగారంటే, ఆ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించాయో ఊహించవచ్చు. ఆనాడు ఈ మూడు చిత్రాలు ఎక్కువ పేరుప్రఖ్యాతులుకూడ గడించాయి (మిక్కిలినేని వారి నటరత్నాలు). 

విశేషం ఏమిటంటే, వినటానికి ఇకటిఅరా పాటలుమినహా, ఈ మూడు చిత్రాలు చూడటానికి మనకు లభించటంలేదు. వి.సి.డి. రూపంలో తెలుగులో మనకు లభిస్తున్న బహుపాత సినిమా అంటే 1935 లో వచ్చిన కన్నాంబగారి "హరిశ్చంద్ర" మాత్రమే. 1933 లో వచ్చిన రెండవ సావిత్రి సినిమావి రెండు ప్రకటనలు కనబడుతున్నాయి. ఒకటి భారత మూవీటోన్ వారిది మరొకటి కృష్ణా ఫిలిం కంపెనీ వారిది. సావిత్రి పాత్రధారిణి పేర్లు కూడా వేరుగా వున్నాయి. బహుశా జ్యోతిచిత్ర సంచికలో ప్రచురించిన వివరాలలో కూడా తప్పులు దొర్లినట్లున్నాయి. ఈ సంశయం తీరాలంటే సావిత్రి సినిమా గురించి హిందూలో వచ్చిన శ్రీ ఎమ్. ఎల్. నరసింహం గారి వ్యాసమే శరణ్యం. ఈ వ్యాసంలో పి. రామతిలకం గారి పేరు దాసరి రామతిలకంగా పేర్కొనటం జరిగింది. 

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/SATI-SAVITHRI-1933/article15677331.ece 


పైగా ఆ సంవత్సరం ఆగస్టులో బెజవాడలో కృష్ణా పుష్కరాలు. సావిత్రి సినిమాని ఆది, అంత్య పుష్కరాల సమయంలో ప్రదర్శించినట్లు ప్రకటనల వల్ల తెలియవస్తోంది. 
రామతిలకం గారి గురించిన సమాచారాన్ని, పుల్లయ్య గారి గురించి జూన్ 1935 నాటి చంద్రిక సంచికలో వచ్చిన వివరాలు చూద్దాము. 
1933లో వచ్చిన సావిత్రి సినిమాతోనే పాటలు మొదటిసారిగా రికార్డులపై వచ్చాయని శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు ఒక వ్యాసంలో పేర్కొన్నారు. 


ఆ రోజుల్లోనే సినిమా పాటలు పుస్తకాలుగా రావటం చాలా విశేషం. అదికూడా బహుశా ఈస్టిండియా వారి రామదాసు సినిమాతో మొదలు. సావిత్రి సినిమావి రెండురకాల పాటల పుస్తకాలు వచ్చాయి. 1934లో గ్రామఫోన్ రికార్డుగా వచ్చిన సావిత్రి నాటకము ప్రకటన ఇది. అయితే ఈ రికార్డు ఎవరిది అన్నవివరాలు తెలియవు. 


ఆ రోజుల్లో పుస్తకాల క్యాటలాగులు ప్రచురించేవారు. సరస్వతి బుక్ డిపో వారి క్యాటలాగులో సావిత్రి నాటకం గురించి ఇలా ప్రస్తావించారు. 


 సి. పుల్లయ్య గారి కుమారుడు దర్శకుడు అయిన సి.ఎస్.రావు గారు (నటి రాజసులోచన భర్త) “ఈస్టిండియా కంపెని కధ-కమామిషు” అంటూ నాటి సావిత్రి సినిమా నిర్మాణం గురించి ప్రస్తావించిన విశేషాలు జ్యోతిచిత్ర సంచికలో ప్రచురించారు. 
సావిత్రి సినిమా గురించి వికీపీడియాలో, ఈ సినిమా రెండవ వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో ‘ఆనరరీ డిప్లొమా విన్నర్’ అని రాశారు. కానీ లభించిన సమాచారం ప్రకారం అది ఈస్టిండియా వారి బెంగాలి సినిమా ‘సీత’ కానీ సావిత్రి సినిమా కాదు. 
సందర్భంవచ్చింది కాబట్టి చాలా ఏళ్లకిందట రేడియోలో వస్తే రికార్డు చేసిన ‘సావిత్రి నాటక ఘట్టాలు’ అన్న చిన్న ఆడియో విందాము. దీంట్లో వినిపించే ఒక పాట సావిత్రి సినిమా పాటల పుస్తకంలోనిది, అలాగే సంభాషణలు, పద్యం మాతాతగారి సావిత్రి నాటకంలోనివి. దీనినిబట్టి ఇది ఆ సినిమాయొక్క, లేదా నాటకంయొక్క గ్రామఫోన్ రికార్డు అయివుండాలి. 


ఎస్. వరలక్ష్మి, నాగేశ్వరరావు గార్లు నటించిన సతీసావిత్రి 1957 సినిమా కొంతమందికి తెలిసేవుంటుంది. వరలక్ష్మి పిక్చర్స్ పతాకంపై కడారు నాగభూషణం గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా మాతాతగారి సావిత్రి నాటకానికి అనుసరణ అన్నది సినిమా టైటిల్స్ లో కనబడుతుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి “అలనాటి నాటకాలు” పుస్తకంలో కూడా మాతాతగారి సావిత్రి నాటకవృత్తాంతం గురించి వివరించారు. 

మాతాతగారు వారి మిత్రులైన ఒక నిర్మాత ప్రేరణపై “సతీతులసి” కధను సినిమాకు అనుగుణంగా వ్రాసారు. అయితే అదేకధను మరొకరు సినిమాగా తీయటంతో ఆ నిర్మాత ఆ ప్రయత్నం విరమించారు. ఈ సతీతులసి సినిమాకధ అటకెక్కటంతో దానికి మరింత మెరుగులుదిద్ది “బృంద” నాటకంగా తరువాత ప్రచురించారు. 

ఆ మరొక సినిమా చిత్రపు నరసింహారావు గారి దర్శకత్వంలో 1936లో వచ్చిన శ్రీరామా ఫిలిమ్స్ వారి సతీతులసి. ఇందులో గగ్గయ్య, శ్రీరంజని గార్లు నటించారు. 

ఆ రోజుల్లో సినిమాలు పోటాపోటీలుగా తీసేవారు. ఇందుకు మరొక ఉదాహరణ ఒకే ఇతివృత్తంతో 1936లో వచ్చిన బళ్ళారి రాఘవాచార్యులు గారు నటించిన “ద్రౌపది మానసంరక్షణము”, సి.ఎస్.ఆర్. గారు నటించిన “ద్రౌపది వస్త్రాపహరణము”. ఆరోజుల్లోనే దినపత్రికలో పుటమొత్తంగా ఇలా సినిమా ప్రకటనలు ఇచ్చేవారంటే ఆశ్చర్యంవేస్తుంది. మాతాతగారి అముద్రిత గ్రంధం ‘భక్తకబీరు’ కూడా 1936లో సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో వీరు పాటలు కూడా రచించారన్నట్లుగా పైడిపాల గారి ‘తెలుగు సినిమా పాట’ పుస్తకం ద్వారా తెలుస్తోంది. 
భక్తకబీరు సినిమా నిర్మాత,  అలనాటి ప్రముఖ చిత్రనిర్మాణసంస్థ వేల్ పిక్చర్స్ (కృష్ణలీలలు) నిర్మాత పి. వి. దాసు గారు, రాజరాజేశ్వరి చిత్రనిర్మాణసంస్థ నిర్మాత కడారు నాగభూషణం గారు (కన్నాంబ గారి భర్త) మాతాతగారికి రాసిన ఉత్తరాలు చూద్దాము. 
తిరిగి మాతాతగారు 1945లో కడారు నాగభూషణం గారి దర్శకత్వంలో వచ్చిన రాజరాజేశ్వరి వారి ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాకు సంభాషణలు, పద్యాలు రాయటం జరిగింది. 
అటు సాహిత్యం ఇటు నాటక, సినిమా రంగాలలో ప్రవేశం ఉండటంతోపాటు ఆయా రంగాలలో వున్న ప్రముఖుల సాన్నిహిత్యంవల్ల, నాటి కొంతమంది జమిందారుల పరిచయభాగ్యంవల్ల, వర్తకశ్రేష్ఠుల అండవల్ల, వీరంతా పోషకులుగా ఉండటంతో “సావిత్రి గ్రంధమండలి” అన్న సంస్థను స్థాపించి గ్రంధప్రకటనకు నడుంకట్టారు. 

పోషకులుగా ఉన్న ఏలూరు, గద్వాల, వనపర్తి, బుచ్చిరెడ్డిపాలెము, నెల్లూరు జమిందార్లు, స్థానం, సి.ఎస్.ఆర్., అద్దంకి శ్రీరామమూర్తి, పారుపల్లి సుబ్బారావు, గోవిందరాజుల సుబ్బారావు వంటి నటులు, కే.యన్. కేసరి (గృహాలక్ష్మి సంపాదకులు), వావిళ్ల వేంకటశాస్త్రి (వావిళ్ల ప్రెస్), దర్శకుడు బి.ఎన్. రెడ్డి (వాహిని), అయ్యంకి వెంకటరణయ్య పంతులుగారు లాంటి ప్రముఖుల పేర్లవల్ల ఆనాడు వారికి ఉన్న పలుకుబడి, పరపతి అర్ధమవుతుంది.

వీరు సావిత్రి నాటకంతో పాటు లలిత, బృంద, దివోదాసు అన్న నాటకాలను రచించి, గురువులైన చెళ్ళపిళ్ళ వారితోపాటు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణమాచార్య, వేలూరి శివరామశాస్త్రి మొదలుగా అనేకమంది పండితప్రభ్రుతుల ప్రశంశలతోపాటు, కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరసరస్వతీ స్వాములవారి ప్రోత్సాహాన్ని పొందారు. బృంద (సతీతులసి) నాటకం 1948, 49, 50 సంవత్సరాలకు ఎం. ఏ. విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంధంగా మద్రాసు యూనివర్సిటీ వారు ప్రకటించారు. 

వీరివి సావిత్రి, లలిత నాటకాలు  డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా లో లభిస్తున్నాయి. 

సావిత్రి 1938  
సావిత్రి 1958  
లలిత 

లలిత నాటకం గురించి నాటి మాసపత్రిక “విభూతి” లో ప్రచురించిన పుస్తకపరిచయం. 


అలాగే వీరి వ్యాసాలుకొన్ని నాటి భారతి సంచికలో ప్రచురింపబడ్డాయి. విశ్వదాత శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు రెండు సంవత్సరములు వీరి కుటుంబభరణమునకు తోడ్పడ్డారు. 

రచయిత అన్నాక పండితాభిప్రాయంకోసమో, కానుకగానో తమరచనలను తోటిపండితులకు బహుకరించటం ఆనవాయితీ. ఆ క్రమంలో మాతాతగారికి బహుమతిగా వచ్చిన పుస్తకాలలో శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు వారి దస్తూరితో బహుకరించిన కిన్నెరసాని, కోకిలమ్మపెళ్లి పుస్తకం ఒకటి.
విశ్వనాధ
అలాగే కవి పండితులన్నాక వివాహసందర్భాలలో పద్యరత్నాలరూపంలో ఆశీస్సులు అందించటం కూడా ఆనవాయితీ. వనపర్తి రాజా శ్రీ రామేశ్వరరావు గారి రెండవ కుమారుడు శ్రీ రామదేవరావు గారి వివాహసందర్భంగా మాతాతగారు రాసిన పద్యరత్నములు. 

వనపర్తి రాజావారి మరిన్ని వివరాలు ఈ లింకు ద్వారా చూడవచ్చు. 
కాశీనాధుని నాగేశ్వరరావు గారి కుమార్తె కామాక్షి శివలెంక శంభుప్రసాద్ గార్ల వివాహసందర్భంగా మాతాతగారు రాసిన పద్యరత్నములు ఇవి. 


నాగేశ్వరరావు గారు ఏకంగా శుభలేఖను ఆంధ్రపత్రికలోనే ప్రచురించి అందరిని ఆహ్వానించారు. ఆ రోజుల్లో ఏడురోజులపాటు వివాహవేడుకలు జరిగేవి. ఈ ఆహ్వానపత్రిక చూడండి ఎంతమంది మహావిద్వాంసులు వివాహసందర్భంగా కచేరీలుఇచ్చారో. ఆనాడు ఉన్నకవి పండితులందరూ పద్యరత్నాలు సమర్పించారు. ఆ పద్యాలతో, కొంతమంది కవుల చిత్రాలతో ఆంధ్రపత్రికవారు “కామాక్షి కళ్యాణము” అనుపేరిట పుస్తకాన్ని ప్రచురించారు. 

ఇవి మాతాతగారు నాటి హైదరాబాద్ ప్రధానమంత్రి మహరాజ సర్ కిషన్ ప్రసాద్ గారికి సమర్పించిన విజ్ఞాపనలు. మాతాతగారు ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూవుండేవారు. ఇది ఆనాటి రైల్వేకంపెనీ వారి సీజన్ టికెట్. ఇలా మనపెద్దవాళ్ళ గురించి గుర్తుగా దాచిపెట్టుకున్న చిన్నచిన్న జ్నాపకాలు చాలఏళ్ల తరువాత చూస్తే ఆశ్చర్యము, ఆనందము కలుగుతాయి. 


మరి చివరగా అలనాటి ఒక గ్రామఫోన్ పాట. ఉప్పులూరి సంజీవరావు గారు సావిత్రి నాటకంలో సావిత్రిగా నటించారు. వారు 1932లో హచ్చిన్స్ గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీ వారికోసం కొన్ని పాటలు పాడారు. సావిత్రి నాటకంలో సావిత్రిపాట “పోవుచున్నాడే” యమధర్మరాజు సావిత్రిభర్తప్రాణాలు తీసుకుపోతున్న సన్నివేశంలోనిది విందాము. ఈనాడు ఈపాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కాని వీటిని ఈనాటికి భద్రపరిచి వాటిని డిజిటైజ్ చేసి మనకు అందిస్తున్నవారి సేవలు మరువకూడదు. ఇవన్నీ మన తెలుగుచరిత్ర, సంస్కృతిలో భాగాలు. ఇది శ్రీ మొదలి నాగభూషణశర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. వారికి, ఎమ్. సూరిబాబు గారికి (క్రియేటివ్ లింక్స్) కృతజ్నతలు, ధన్యవాదములు. 
తోడ్పడిన పుస్తకములు

పోణంగి శ్రీరామ అప్పారావు గారి తెలుగు నాటక వికాసము
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి ఆంధ్ర నాటకరంగ చరిత్ర
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి నటరత్నాలు
ఆంధ్రపత్రిక వారి కామాక్షికళ్యాణము
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్నాపకాలు
మొదలి నాగభూషణశర్మ గారి తొలినాటి గ్రామఫోన్ గాయకులు
పైడిపాల గారి తెలుగుసినిమా పాట
కె. ఎన్. టి. శాస్త్రి గారి అలనాటి చలన చిత్రం
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి అలనాటి నాటకాలు
సరస్వతీ బుక్ డిపో వారి క్యాటలాగు
జ్యోతిచిత్ర ప్రత్యేక సినిమా సంచిక - జనవరి 1980 (సి.ఎస్.రావు గారి వ్యాసం, విడుదలైన చిత్రాలు)
ఆంధ్రప్రభ వారి మోహిని ప్రత్యేక సినిమా సంచికలు (వి.ఎ.కె. రంగారావు గారి వ్యాసాలు)
శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారి సావిత్రి, లలిత, బృంద, దివోదాసు నాటకాలు

తోడ్పడిన వెబ్సైట్లు 

ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ (ఆంధ్రపత్రిక, గోల్కొండపత్రిక, భారతి, విభూతి, చంద్రిక, వినోదిని లాంటి పాత సంచికలు)
డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా
సఖియా.కాం (పాటల పుస్తకాలు)
వికిపీడియా
హిందూ దినపత్రిక (ఎమ్.ఎల్. నరసింహం గారి సినిమా వ్యాసాలు)

Tags: Sriramula Sachidananda Sastry, Sreeramula Sachidananda Sastry, Savithri 1933, Savitri,

No comments:

Post a Comment