Wednesday, May 1, 2013

మశకమహాశయుల స్త్రోత్రా భాసము

వెనుకటికి “హరి యను రెండక్షరములు హరియించును పాతకంబులు” అన్నాడు శ్రీకృష్ణ శతక కారుడు. ఇప్పుడు “దోమ యను రెండక్షరములు కలిగించును పాతకంబులు” అంటున్నారు వైద్యులు. మానవుడి మీద ఆధారపడి జీవించే మూడు ప్రాణుల పేర్లు చెప్పమంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి దోమ, పేను, నల్లి. ఈ మూడు బ్రహ్మ వరప్రసాద జీవులు. అదేంటోగాని ఈ మూడిటికి రక్త దాహమే. మానవుడి రుధిరము మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. వీటిల్లో పేను మానవుడి సహజీవనంలో భాగమైపోయింది. వీటిని అంతో ఇంతో భరించటానికి మానవుడు కూడా సిద్ధమయ్యాడు. ఇక నల్లి అంటారా అట్టే బాధించకుండా, ఇబ్బంది కలిగించకుండా వీలుచూసుకొని పాపం తనపని తాను చేసుకు పోతుంది. ఎవర్రా మిగిలింది అంటే దోమ. ఈ పేరు ఎత్తితేనే మానవుడికి భయం, కంట్లో కునుకు పట్టదు.

దోమలు సృష్టి ఆరంభంనుంచి ఉన్నట్లుగా మనకు గోచరం అవుతోంది. దోమలు మొదట్లో శాఖాహారులని ఆకులమీద, పైర్ల మీద ఆధారపడి మనుషులకు దూరంగా బ్రతికేవట. అయితే మానవుడు తన జీవనం కోసం వాటికి నిలువ నీడ లేకుండా చేస్తూ ఉండటంతో అవి మానవుడిపై కత్తి గట్టి మాంసాహారులుగా మారాయని ప్రతీతి. ఇప్పటికీ మనం గడ్డి మీద బ్రతికే పసిరిక దోమలను చూస్తూవుంటాము. మానవుల మాదిరిగానే దోమల్లో కూడా చాలా రకాలు వున్నాయి. చుక్కల దోమ, మచ్చల దోమ, తెల్ల దోమ, నల్ల దోమ, ఎర్ర దోమ, పెద్ద దోమ, చిన్న దోమ అంటూ నానారకాలు వున్నాయి. 

దోమలు మనం రక్తసంబంధీకులం. ఇరువురిలోని ప్రవహించేది ఒక రక్తమే. మనం ఎలాగైతే మన పూర్వీకులు మహర్షులు, రాజులు, ఇంత గొప్పవారు, అంతా గొప్ప వారని గొప్పలు చెప్పుకుంటామో దోమలు కూడా అలాగే చెప్పుకుంటాయని దోమల భాష తెలిసిన మిత్రుడు చెప్పాడని చింతా దీక్షితులు గారు “ఆంధ్ర - దోమల సభ” వ్యాసంలో పేర్కొన్నారు. నిజమే మరి ఆ దోమల్లో ప్రవహించేది మన పూర్వపు రాజుల రుధిరమేగదా. దోమలు మరి ఈనాటికి స్వైరవిహారం సలుపుతున్నాయంటే వాటిల్లో ప్రవహించే ఆ రక్తపు ఆనవాళ్ళ ప్రతిభేకదా. 

మానవులకు గాని వర్ణ, మత బేధాలు దోమలకు అలాంటి బేధమున్న దాఖలాలు లేవు. దోమలు అందరినీ సమానంగా ఒక చూపు చూస్తాయి. అసలు మానవుడు దోమ లాంటి అల్ప ప్రాణికి ఎందుకు భయపడతాడో అర్ధం కాదు. పాపం అవి వాటి మనుగడ కోసం సూది మొనంత రక్తాన్ని ఆస్వాదిస్తేనే ఏదో పెద్ద తమ రక్తమంతా తాగేసినట్టు మానవులు గగ్గోలు పెడతారు. భవంతుడు వాటికి మానవుల మీద ఆధారపడండని శాసించాడు. వాటి కర్తవ్యాన్ని మనసా వాచా కర్మణా అవి పాటిస్తుంటే వాటి కర్మలను చేసుకోనీయకుండా మనం అడ్డుపడటం భావ్యమేనా. పాపం నోరు లేని ప్రాణులు. నిజంగా వాటికి నోరు వుంటే మన మనుగడ ఏమయ్యేదో ఆలోచించండి. ఏ ప్రాణి అయినా వాటి పూర్వపు కర్మలు నిర్వహించు కోవటానికే భూమి మీద అవతరిస్తాయి. కర్మ విషయమై గీతా కారుడు ఎమన్నాడో విజ్నులైన వారందరికి విశదమే.

మానవులు తమ “ప్రమేయంగా” తోటి ప్రాణికి రక్త దానం చేస్తారు, అమ్ముకోనేవారు లేకపోలేదు, పరీక్షల నిమిత్తం బోలెడంత రక్తాన్ని వృధా చేస్తారు. అలాంటిది దోమలు “అప్రమేయంగా” కించిత్తు రక్తాన్ని ఆస్వాదిస్తే సంకుచిత భావాన్ని ప్రదర్శించటం భావ్యమేనా. 

మానవుడు ఏదన్నా ప్రాణికి భయపడితే ఆ ప్రాణిని బోనులో బంధించి తాను బయటవుండి ఆనందిస్తాడు. అలాంటిది దోమ విషయంలో తాను దోమతెర లాంటి బోనులో బందీయై ఆనందిస్తాడు. ఎంత వైచిత్రి. 

దోమ మానవుల వైరికి కారణం దోమ కుట్టటం వల్ల వ్యాధులు వస్తాయన్నా అపప్రభ వల్ల. ఇద్దరిలో ప్రవహించేది ఒకే రక్తమైనప్పుడు దోమకు రాని వ్యాధి మనుషులకు వస్తుందనటం హాస్యాస్పదం. చెట్లు ఎలాగైతే మానవులు వదిలిన చెడు గాలిని పీల్చుకొని మంచి గాలి వదులుతాయో దోమలు కూడా చెడు రక్తాన్ని పీల్చి మంచి రక్తంగా మారుస్తాయి. అందువల్లనే ఎంతమంది దగ్గర రక్తాన్ని పీల్చినా వాటికి ఎలాంటి జబ్బులు రావటంలేదు. మానవుడు లోపాన్ని తనలో పెట్టుకొని వాటిని దోమలకు అన్వయించటం ఎంతవరకు సముచితం. మానవుడి శరీరంలో ఎంతో రక్తముంటుంది. దోమ శరీరంలో ఆవగింజంత గూడా వుండదే. అంత చిన్న ప్రాణికి జబ్బులు వ్యాప్తి చేయటం సాధ్యమేనా. మానవులు పీల్చి వదిలిన గాలితోనే పక్కవారికి జబ్బులు వస్తున్న రోజులివి. నిజంగా దోమల వల్ల జబ్బులు వస్తే ఈ పాటికి మానవజాతి ఎప్పుడో అంతరించి పోయేది. అసలు దోమలు రక్తాన్ని స్వీకరిస్తాయే గాని తిరిగి రక్తాన్ని ఇవ్వటం వాటి వంశ చరిత్రలోనే లేదు. అందువల్ల దోమ కుట్టటం వల్ల దాని రక్తం తిరిగి మనలోకి ఎక్కదు. ఈ సూక్ష్మ విషయాన్ని గమనించకుండా, నోరు తిరగని వ్యాధుల పేర్లు చెప్పి అవి దోమల వల్ల వ్యాప్తి చెందుతున్నాయనటం సబబేనా. అసలు వ్యాప్తి అంటే ఒక చోట వున్నదానిని మరోకచోటికి తీసుకెళ్లటం అని అర్ధం. అంటే ఒక మానవుడిలో వున్న వ్యాధిని ఇంకో మానవుడిలో ప్రవేశ పెట్టటం. దీనికి కారణ భూతం దోమట. దీనిని బట్టే తెలుస్తోంది వ్యాధి మానవుడిలోనే వుందని. వ్యాప్తి చేయటం దోమ వ్యాపకం. ఇలా ద్వంద ప్రమాణాలు పాటించటం మానవుడికే చెల్లు. 

ఒప్పుకోవటానికి మానవులకు అహం అడ్డువస్తుంది గాని దోమల వల్ల మానవులు చాలా నేర్చుకునారు. శుశ్రుతుడు మానవుల నుంచి రక్తాన్ని గ్రహించే విధానాన్ని దోమలనుండే తెలుసుకున్నాడు. దోమ చూడండి ఎంత చక్కగా మన శరీరంనుండి తన తొండం ద్వారా రక్తాని గ్రహిస్తుందో. ఇప్పుడు మనం ఉపయోగితున్న రుధిర పరీక్షా పరికరాలన్నీ ఈ కోవకు చెందినవే. ఆ మాటకొస్తే నొప్పి తెలియకుండా ప్రజల నుండి పన్నులు ఎలా గ్రహించాలన్న విషయాన్ని దోమల నుండే కౌటిల్యుడు నేర్చున్నారని మునిమాణిక్యం వారు వారి “మనహాస్యం”లో ఉదహరించారు. మశక మహాశయులు సాయం వేళల్లో గంధర్వగానం చేస్తాయి. ఇవి ఈ గానాన్ని గంధర్వుల వద్ద అభ్యసించాయి. మానవులు ఈ విద్యను దోమల వద్ద నుండి సంగ్రహించి తమదని గొప్పలు గొట్టుకుంటున్నారు. త్యాగయ్య లాంటి విద్వాంసులే ఒప్పుకున్నారు పశు పక్ష్యాదుల కదలికల్లో, ధ్వనుల్లో సంగీతం జనిస్తుందని. ఒకసారి దోమ మీ చెవి దగ్గర చేసే గానాన్ని ఆస్వాదించండి మీకే తెలుస్తుంది. దోమలు వలయాలుగా పరిభ్రమిస్తాయి. దీనిని చూచే కౌరవులు పద్మవ్యూహం పన్ని అభిమన్యుడిని హరించారు. దోమలు గుంపుగా దాడి చేస్తాయి. ఈ విధానాన్ని మనం నిత్యం అన్ని చోట్ల క్రమం తప్పకుండా ఈ నాటికి పాటిస్తున్నాము. 

ఇంత నేర్చినా గాని మానవుడు దోమలను చంపాలని చూస్తున్నాడు. వాటి జాతి అంతం చేయాలని కంకణం కట్టుకొన్నాడు. మానవుడు ఎంత కృతఘ్నుడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఈ అల్ప ప్రాణిని సంహరించటానికి అనుసరించని మార్గాలు లేవు. ఒక్కో సారి వాటి నిర్మూలనలో తానూ చెప్పుకోలేని బాధలు పడుతున్నాడు. అందులో బాష్ప బాణం ఒకటి, అంటే పొగ బెట్టటం. దోమ సంగతేమోగాని ఆ పొగలో ఊపిరాడక కొట్టుమిట్టాడటం జగమెరిగినదే. వాయు బాణం మరొకటి. ఆ అల్ప ప్రాణులను పాలద్రోలాటానికి వేగంగా గాలిని ఉధ్బవింప చేసే యంత్రాలను వాడటం. వాటి నియంత్రణాభారంతో తల బొప్పికడుతోంది. వీటిని కట్టడి చేయటానికంటూ చెత్తకుప్పల మీదకు అగ్ని బాణం సంధించగా పక్కన వున్న పూరి గుడిసెలు పరశురామ ప్రీతి అవుతూ వుండటం తెలిసిందే. ఇది చాల నట్లుగా దోమలను హరించటానికి వీధుల్లో కూడా పొగవదిలి పెడుతున్నారు. మనమే ఆ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతాము. అలాంటిది పాపం ఆ పసి దోమలు ఎంత తల్లడిల్లుతాయో అనికూడా చూడరు గదా. వాటిని చంపబోయి తమ శరీరం మీద తామే కొట్టుకుంటూ బాధపడుతున్నారు. ఇవి గాక ఒంటికి పూసుకొనే లేపనాలు. రకరకాల క్రిమి సంహారకాలు వాడుతూ మానవుడు తనకు తానే హాని కల్పించుకుంటున్నాడు.

ఇంత జరుగుతున్నా దోమల వల్ల తనకు ఇతోధికంగా మేలు జరుగుతోందన్న విషయాన్ని గ్రహింపలేకున్నాడు. దోమలను నియంత్రించటానికి తయారయ్యే అనేకానేక వస్తువులు తయారు చేసే పరిశ్రమలలో పని చేస్తూ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. ఎన్నో కుటీర పరిశ్రమలు దోమతెరలు అవి తయారు చేస్తూ బ్రతుకుతున్నాయి. ఈ మధ్య విదేశీ వస్తువులు కూడా తయారు అయ్యాయి. దీనివల్ల ఎంతో విదేశీ మారక ద్రవ్యం దేశాల మధ్య చేతులు మారు తోంది. దోమల నుండి తప్పించుకోవటం ఎలా అనే ప్రకటనలు మనం నిత్యం చూస్తూనేవుంటాము. ఈ ప్రకటనల రాబడి ద్వారా చాలా మంది లభ్ది పొందుతున్నారు. ఎంతోమంది పారిశుధ్యపు పనివారు ఉపాధి పొందుతున్నారు. మానవుడు ఎంత కుటిల స్వభావుడు. దోమల వల్ల ఇంత సాయం పొందుతూ కూడా వాటికి హాని సల్పుతున్నాడు.

ఎవరన్నా అతిధి వస్తే ముందుగా ప్రశ్నించేది దోమలు ఎలాగ వున్నాయని. మన జీవితంలో కనబకుండా అవి మన భాగస్వాములవుతున్నాయి. వీటికి ప్రాంతీయాభిమానం కూడా బహు మెండు. మన హైద్రాబాదు నగర దోమల ఖ్యాతి విశ్వవిఖ్యాతము. 

పూర్వం ఋషులు తమ చుట్టూ ఏమి జరుగుతున్నా గాని పట్టించుకోకుండా తపస్సు సలిపేవారు. చీమలు, పురుగులు పాకుతున్నా లెక్క చేయకుండా అంత ధ్యానం చేసేవారు. అలాంటి నిగ్రహశక్తి ఈనాడు మానవులు కోల్పోయి దోమల వల్ల ధ్యానం చెయ్యలేకపోతున్నామని వంకలు వెతుక్కుంటున్నారు. సాయం వేళల్లో వ్యాహ్యాళికి వెళ్ళ లేక పోతున్నామని, బయటకు వచ్చి కబుర్లు చెప్పుకోవటానికే భయంగా వుందని, పిల్లలు ఆడుకోవటానికి లేకుండా వుందని, ఆఖరుకు పిల్లవాడు పరీక్షలో తప్పినా దోమలే కారణమని నానా రకాల నిందలు దోమలకు ఆపాదిస్తున్నారు. వాటికి నిలువ నీడ లేకుండా చెయ్యటం వల్ల గదా అవి మనని ఆశ్రయిస్తున్నవి. మురికి గుంటలు సమృద్ధిగా ఏర్పాటు చేస్తే అవి మన జోలికి రావు గదా. వాటి వంశాభివృద్ధి అవి చేసుకుంటాయి. 

దోమలకు అపారమైన దృష్టి కలదు. తృటిలో తప్పించుకుంటుంది. అందనంత ఎత్తులో పరిభ్రమిస్తుంది. అవి లింగ బేధం పాటిస్తాయి. కొన్ని దోమలకు మగవాళ్ళ రక్తమంటేనే బహుప్రీతి. పక్కన వున్న ఆడు వారి కేసి కన్నెత్తి చూడవు. 

మానవుడు ఈ దోమలను జయించటం కల్ల. సూర్య చంద్రాదు లున్నంతకాలం మనకీ వైరి తప్పదు. లోకాసమస్తా, సర్వేదోమా సుఖినోభవంతు. 

ప్రేరణ: పానుగంటి వారి “సాక్షి” వ్యాసం, మునిమాణిక్యం వారి “మనహాస్యం”, చింతా దీక్షితులు గారి “ఆంధ్ర – దోమల సభ” వ్యాసం.

No comments:

Post a Comment