చిన్నక్క: హల్లో ఏకాంబరం
ఏకాంబరం: రారా చిన్నక్క, సమయానికొచ్చావు
చిన్నక్క: ఏం ఏకాంబరం తీరుబడిగా సినిమా చూస్తున్నావు.
ఏకాంబరం: బాలనాగమ్మ సినిమా చిన్నక్కా
చిన్నక్క: ఆ ఈమధ్య యూట్యూబ్లో అన్నిసినిమాలు దొరుకుతూనే వున్నాయికదా ఏకాంబరం.
ఏకాంబరం: ఇక్కడే పప్పులో కాలేశావు, ఇది 1942 నాటి జెమినీవారి బాలనాగమ్మ
చిన్నక్క: అవునా, నిజంగానా, నేను పుట్టిపెరిగాక ఈ సినిమా చూడలేదు ఏకాంబరం, ఎప్పటినుండో చూడాలని వుంది.
ఏకాంబరం: అదీమరి, ఇదేకాదు “గొల్లభామ”, సి.ఎస్.ఆర్. గారు నటించిన “పరమానందయ్యశిష్యులు” సినిమాలు కూడా చూసివుండవు.
చిన్నక్క: ఇవన్నీ ఎప్పుడో దూరదర్శన్ లో వచ్చాయని విన్నాను కానీ చూడటం కుదరలేదు.
ఏకాంబరం: ఇవేకాదు, ఇతర భాషలలో సినిమాలు, మూకీసినిమాలు అన్నికలిపి కొన్నివేల సినిమాలు వున్నాయి.
చిన్నక్క: మూకీ అంటుంటే రఘుపతి వెంకయ్యగారు, ఫాల్కేగారు గుర్తుకు వస్తున్నారు.
ఏకాంబరం: ఇక్కడ 1899 నాటి “Panorama of Calcutta” 1906 నాటి “An Indian washing the baby” డాక్యుమెంటరీలు, ఫాల్కేగారి “Raja Harishchandra” మూకీలు కూడా చూడవచ్చు
చిన్నక్క: ఊరికే ఊరించటంతప్ప ఇంతకీ ఎక్కడో చెప్పవు
ఏకాంబరం: ఇదిగో ఇది దాని లింకు
ఏకాంబరం: కావలసిన సినిమా మీద డబల్ క్లిక్ చెయ్యి, ఆ సినిమా ఓపెన్ అవుతుంది. ఎడమచేతివైపు మరొక చిన్న వీడియో బాక్స్ కనబడుతోందికదా, దానిమీద కర్సర్ అటూఇటూ కదిలిస్తే సన్నివేశాలు మారుతూ కనిపిస్తాయి, టైటిల్స్ మీదకాని ఎక్కడన్నాకాని క్లిక్ చేస్తే, పక్కన పెద్ద బాక్స్ లో అదే సన్నివేశం కనబడుతుంది, అప్పుడు పెద్దబాక్స్ లోని ప్లే మీద క్లిక్ చేసి చూడటమే.
చిన్నక్క: చాలా బావుంది ఏకాంబరం
ఏకాంబరం: దీంట్లో కావలసిన సంవత్సరం మీద క్లిక్ చేసి ఆ ఏడాదిలో సినిమాలు, అలాగే తెలుగు మీద క్లిక్ చేసి తెలుగు సినిమాలు, ఇలా నానారకాలుగా సార్టింగ్ చేసి మనకు కావలసినది చూడవచ్చు. కొన్ని సినిమాలు పూర్తిగా లేవు. 1948 నాటి ద్రోహి సినిమా పూర్తిగాలేదు.
చిన్నక్క: ఈ మాత్రం అవకాశం కల్పించారు. దానికి వారికి ధన్యవాదాలు చెప్పాలి.
ఏకాంబరం: మనకు కొన్ని సినిమాలలో పాటలు దొరకనప్పుడు, ఇక్కడ సినిమాచూస్తూ కంప్యూటర్ లోని ఆడియోరికార్డర్ ద్వారా ఆ పాటలు రికార్డు చేసుకోవచ్చు. కానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే మహాఅయితే ఒక ఐదారు సినిమాలు మినహా చాలావరకు యూట్యూబ్ లోనో , వి.సి.డి.ల రూపంలోనో లభిస్తున్నాయి. కొన్ని పాత సినిమాలు అప్పుడప్పుడు టి.వి.లలో వేస్తూనేవున్నారు.
చిన్నక్క: కానీ నేను గమనించినదేమిటంటే ఏకాంబరం, ఇది ఒక రీసెర్చ్ లైబ్రరి లాంటిది. పరిశోధకులకు మంచి ఉపయోగం.
ఏకాంబరం: నువ్వన్నది కరక్టే చిన్నక్కా, కానీ వీటినన్నిటిని ఇంకా ఇక్కడ లభించనివాటిన్నిటిని మనవాళ్లు ఏకిపారేసి అనేకానేక పుస్తకాలు, వ్యాసాలు రాసిపారేశారు.
చిన్నక్క: ఏదిఏమైనా మంచి విషయం చెప్పావు ఏకాంబరం, ముందు ఇంటికివెళ్ళి ఆ బాలనాగమ్మ సినిమా చూడాలి. వుంటాను ఏకాంబరం.
ఏకాంబరం: ఒకే చిన్నక్కా.
ద్రోహి సినిమాలో “చక్కలిగింత” మీద జి. వరలక్ష్మిగారు పాడిన ఒక పాట వున్నది. ఇది కోన ప్రభాకరరావు, వరలక్ష్మిగార్లమీద చిత్రీకరించిన పాట. ఈ పాట చాలామంది వినివుండరు. రికార్డులో పాటకు, సినిమాలో పాటకు మొదట్లో కొంచెం తేడా వుంటుంది. ఇప్పుడు సినిమానుండి రికార్డు చేసిన ఈ పాట విందాము.