ముందుగా ఈ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.
ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఏడాదికి పదిలక్షలు (ఒక్కసారిగా కాని లేదా అన్నిసార్లు కలిపికాని) పైన నగదు డిపాజిట్ చేస్తే, బ్యాంకు వారు ఆ వివరాలను ఆదాయపు పన్ను వారికి తెలియపరుస్తారు. ఆ డబ్బు ఎక్కడనుండి వచ్చిందని వారు ప్రశ్నిస్తారు, అందుకు తయారయి వుండాలి. ఒక్కోసారి మూడు, నాలుగు లక్షలు డిపాజిట్ చేసినా తెలిసే అవకాశం వుంటుంది.
ఏప్రిల్ నుండి మీరు బ్యాంక్ నుండి ఎంత డ్రా చేశారో చూసుకోండి, దానిలోదే వాడని డబ్బులు తిరిగి డిపాజిట్ చేశామని కొంతవరకు చెప్పుకోవచ్చు.
స్థిరాస్తులను అమ్మదలిచి అడ్వాన్సుగా నగదు తీసుకున్నాను, ఆ నగదు బ్యాంకులో డిపాజిట్ చేశానని చెప్పటం కుదరదు. ఆదాయపు పన్ను చట్టంలో చేసిన సవరణల మూలంగా, స్థిరాస్తులను అమ్మినపుడు 20,000 పైన నగదు రూపంలో తీసుకోకూడదు. చెక్కు, డి,డి, రూపంలోనే తీసుకోవాలి. నగదు తీసుకుంటే భారీగా పెనాల్టీ కట్టాల్సి వుంటుంది.
ఈ పరిణామంతో బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యే అవకాశం వుంది. ఆదాయపు పన్ను వారి కనుసన్నలలో పడకుండా చిన్న మొత్తాలలో కొంత నగదు డిపాజిట్ చేసే అవకాశం వుంది.
బంగారం ధర తగ్గే అవకాశం వున్నది. ఎక్కువగా నల్లధనంతోనే బంగారం కొంటూ వుంటారు. కొనుగోలు శక్తి తగ్గటంతో డిమాండ్ లేక ధర తగ్గవచ్చు.
కొనుగోలు శక్తి తగ్గి, ఆర్ధిక లావాదేవీలు మందగిస్తాయి. కొన్ని రోజులు దీని ప్రభావం వుంటుంది.
దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పైన బాగా వుంటుంది. కొనుగోలు శక్తి తగ్గుతుంది. ధరలు కూడా తగ్గవచ్చు. అమ్ముడు కాకపోయినా, ముందుగా వారి దగ్గర వున్న నల్లధనంతో కొంతమంది నిర్మాణాలు చేస్తూ వుంటారు. ఇప్పుడు అలా చేయలేరు. దానివల్ల నిర్మాణరంగం స్పీడు తగ్గే అవకాశం వుంది.
ఎవరన్నా మీ అకౌంట్ లో నగదు డిపాజిట్ చేస్తామంటే ఒప్పుకోవద్దు. తరువాత ఆదాయపు పన్ను శాఖవారు ఈ నగదు ఎక్కడిదో చెప్పమంటూ మీకు చుక్కలు చూపిస్తారు.
కొత్తనోట్లు వెంటనే అందుబాటులో వుండవు కనుక కరెంటు, ఫోను బిల్లులు కట్టటానికి ఇబ్బంది తప్పదు. ప్రభుత్వాలకు కూడా పన్నులు, అవి వెంటనే వసూలు కాకపోవచ్చు.
తిరపతి వెంకన్న ఆదాయం భారీగా పెరిగే అవకాశం వున్నది. ఆయన కూడా కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు కొంత తీర్చుకోగలుగుతాడు. ప్రజలలో దాన ధర్మాలు చేసే గుణం ఈ రెండు నెలలు బాగా వుంటుంది. ఆడవారు చీరలు, నగలు కొనుక్కోలేకపోవచ్చు. ఈ రెండు నెలలు దొంగతనాలు తగ్గే అవకాశం వుంది. తరువాత మళ్ళీ పుంజుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ళు కదలవు. పనులన్నీ నత్తనడక నడుస్తాయి. ధర్మం ఈ రెండు నెలలు రెండుపాదాలా నడుస్తుంది. లంచగొండితనం తగ్గుతుంది. ఆ తరువాత నాలుగు రెట్లతో సాగుతుంది. ప్రజలలో ఒక నిర్లిప్త భావం నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు దృష్టి మరలిస్తారు. వేదాంతం వంటబడుతుంది. వివాహాలు నిరాడంబరంగా నడుస్తాయి. పిలిచి చేబదుళ్ళు ఇస్తారు, రెండు నెలల తరువాత నింపాదిగా తీర్చండని. డబ్బు వుండి లేనట్లుగా చేతులు కట్టేసినట్లుగా వుంటుంది. వెయ్యి రూపాయల నోటు పారేసుకున్నా పిలిచి మరీ చేతికి అందిస్తారు. వంద రూపాయల నోట్లు వున్నవారే ధనవంతులుగా చెలామణీ అవుతారు.
ప్రభుత్వానికి ఆదాయపు పన్ను బాగా సమకూరుతుంది. విస్తళ్ళుకుట్టి, బట్టలుకుట్టి, పచ్చళ్ళు అమ్మి సంపాదించామని, బహుమతి ఇచ్చారని, బ్యాంకులో డిపాజిట్ చేసి, ముప్ఫై శాతం పన్ను కట్టి మిగతాది వైట్ చేసుకోటానికి ప్రజలు నూతన మార్గాలు అన్వేషిస్తారు. ఎవరి మీదైతే అక్రమార్జన కింద దాడులు జరిగాయో వారంతా చాలా సంతోషిస్తారు.
డిపాజిట్ చేయలేని నోట్లతో వచ్చే దీపావళికి లక్ష్మి బాంబులను చేసుకోవచ్చు, వచ్చే సంక్రాంతికి భోగిమంట భారీగా వేయవచ్చు, సిగిరెట్టుకు పైన వెయ్యి రూపాయల నోటు చుట్టి దర్పంగా కాల్చుకోవచ్చు, అడుక్కొనే వారికి ఏకంగా అయిదు వందల నోటే ఇవ్వవచ్చు, పరుపులలో దాచుకొని జీవితాంతం నిద్రలేని రాత్రుళ్ళు గడపవచ్చు.
జనవరి తరువాత మళ్ళీ ఎక్కడికక్కడ కొత్త డబ్బును దాచిపెట్టేస్తారు, మళ్ళీ ఎన్నికలకు తయారవ్వాలి కదామరి.
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నము.
super
ReplyDelete