Sunday, November 20, 2016

మోడి ఎఫెక్ట్ – అన్వేషణా మార్గాలు

సదానందం: హల్లో బావగారు, రండి రండి, కులాసానా 

చిదానందం: ఏం కులాసాలేండి, ఈ మోడీ గారు నడ్డి విరిచేశారు 

సదానందం: మోడీ ఎఫెక్ట్ మీమీద కూడా పడిందా ఏమిటి 

చిదానందం: రామన్ ఎఫెక్ట్ అని వినటమే కాని దాని గురించి మన్లో చాలామందికి తెలియదు, కాని ఈ మోడీ ఎఫెక్ట్ తెలియని వాళ్ళు లేరు. 


సదానందం: ఇంతకీ మీ పాత నోట్లు డిపాజిట్ చేశారా? 

చిదానందం: దానికే వస్తున్నాను, ఎలా చేయటమాయని, రెండున్నర లక్షల వరకు ఇబ్బంది లేదని విన్నాను 

సదానందం: లేని మాట కొంత వరకు నిజమే కాని, ఒకే తడవ యాభైవేల పైన డిపాజిట్ చేస్తే ఆ వివరాలు కూడా బ్యాంకు వారు ఆదాయపు పన్ను వారికి తెలుపుతారు. అలాగే అన్ని సార్లు డిపాజిట్ చేసినది కలిపి రెండున్నర లక్షలు దాటితే అదికూడా తెలుపుతారు. 

చిదానందం: మీరు చెప్పిన ప్రకారం  ఒకసారిగా యాభైవేల లోపు డిపాజిట్ చేసి, మొత్తం కలిపి రెండున్నర లక్షలు దాటకపోతే ఇబ్బంది లేదంటారు.

సదానందం: బాగా గ్రహించారు, అయితే మీకు ఒక బ్యాంకు లో రెండు బ్రాంచీలలో అకౌంట్స్ ఉంటేకనుక, రెంటికి కలిపి కష్టమర్ ఐ.డి. ఒకటే కనుక ఇబ్బంది తప్పదు. 

చిదానందం: దానిదేముంది, రెండు మూడు బ్యాంకులలో డిపాజిట్ చేద్దాము, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటూనే ఉంటాయి. 

సదానందం: మీరీ మధ్య భూమి అమ్మారని విన్నాను. 

చిదానందం: దానికే వస్తున్నాను, దీంట్లో నలుపు, తెలుపు తెలిసిందేకదా, బ్యాక్ డేట్లో స్టాంప్ పేపర్ కొని, భూమి అమ్మకానికి బజానాగా నగదు ఇచ్చారని, పాత నగదు డిపాజిట్ చేసుకోవచ్చా? 

సదానందం: ఆదాయపు పన్ను చట్టంలో కిందటి సంవత్సరంలో వచ్చిన మార్పుల మూలంగా, స్థిరాస్తులు అమ్మినపుడు అమ్మినవారు క్యాష్ రూపంలో తీసుకోకూడదు, చెక్కు, డిడి ద్వారా తీసుకోవాలి. ఒకవేళ క్యాష్ లో తీసుకుంటే, పట్టుబడితే అంతకు అంత పెనాల్టీ కట్టాలి. కాబట్టి ఈ మార్గం సుగమం కాదు. 

చిదానందం: మనంతట మనమే డిపాజిట్ చేసిన డబ్బులు ఎక్కడనుండి వచ్చాయో తెలియదు, గాలివాటానికి వచ్చాయి అని చెప్పి, అదేదో 115BBE సెక్షన్ కింద, రిటర్న్ లో డిక్లేర్ చేసి, ముప్ఫై శాతం పన్ను కట్టేస్తే, 200 శాతం పెనాల్టీ వెయ్యరని విన్నాను. 

సదానందం: అంటే ఈ డిసెంబర్ పదిహేను నాటికి దాని కింద అడ్వాన్సు టాక్స్ కడదామనా ఏమిటి? 

చిదానందం: ఏం వద్దంటారా 

సదానందం: అలా అని కాదు కాని, మొన్న వాలంటరీ డిస్క్లోజర్ స్కీం కింద కొంత మంది 45 శాతం పన్ను కట్టారు, మీరు 30 శాతం పన్ను కట్టి తెలివిగా తప్పుకోవటం వారికి సబబు కాదు కాబట్టి, మీలాంటి వారికోసం ఆ సెక్షన్ లో మార్పు తెచ్చి ఆ ౩౦ శాతాన్ని 50 నుంచి 55 శాతందాకా పెంచవచ్చని అభిజ్ఞాన వర్గాల భోగట్టా. అది కూడా వచ్చే జనవరి నాటికి బ్యాంకుల నుండి వివరాలు వచ్చాక, ఈ డిసెంబర్ నాటికి ఆదాయపు పన్ను ఎంత వచ్చిందో చూసుకొని, బహుశా వచ్చే బడ్జెట్ లో కాని అంతకు ముందే కాని చేసినా చేయవచ్చు. 

చిదానందం: అంటే డిపాజిట్ చేసినవారు అడ్డంగా దొరికిపోతారంటారా 

సదానందం: ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసేవారికి అయితే ఇబ్బందులు తప్పవు, మీరు రిటర్న్ ఫైల్ చేయకమునుపే వచ్చే మార్చి లోపునే ఈ డబ్బు ఎక్కడనుండి వచ్చిందో తెలియపరచమంటూ నోటీసులు ఇచ్చే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే కొంతమంది వ్యాపారవర్గాలవారికి నవంబర్ ఏడు నాటికి మీ వద్ద ఎంత క్యాష్ వుందో చెప్పండంటూ నోటీసులు వచ్చాయిట. 

చిదానందం: మరి బ్యాంకులు, వాటి మేనేజెర్స్ డిపాజిట్ టార్గెట్స్ దాటేశారు, దానివల్ల మనకేమన్నా లాభామా? 

సదానందం: లాభామా అంటే, మరి వారికి డిపాజిట్స్ మీద వడ్డీ ఇవ్వటం భారం కాబట్టి, డిపాజిట్స్ మీద వడ్డీ రేటు తగ్గించి, దానికి పర్యవసానంగా వాళ్ళు ఇచ్చే లోన్స్ మీద కూడా తగ్గించవచ్చు. 

చిదానందం: మరి దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా లాభం అని విన్నాను, మరి మనతో పంచుకోరా 

సదానందం:  వచ్చే సంవత్సరం వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్స్ మార్పు చేసే అవకాశం వుండవచ్చు, మరి తిరిగి మధ్యతరగతి ప్రజల అభిమానం పొందాలంటే 

చిదానందం: దీనికంతటికి కారణం ఏమిటాయని 

సదానందం: ఏముందండి, మొదట స్టాక్ మార్కెట్లో విపరీతంగా పన్ను లేనటువంటి లాభాలు గడించారు, దాన్ని తెచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి భూమి విలువలు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు, అక్కడనుండి నగదు సినిమారంగంలోకి, రాజకీయరంగంలోకి ప్రవేశించి, ఈ మూడు రంగాలలోనే తిరగటం మొదలు పెట్టింది. లావాదేవీలు విపరీతంగా జరుగుతున్నాయికానీ ఆ డబ్బులు తిరిగి చలామణీ అవటానికి బ్యాంకులవద్దకు రావట్లేదు. మరి ఆ చక్రభ్రమణాన్ని ఆపాలంటే ఎవరో ఒకరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి కదా. మోడీగారు మధ్యలో చెయ్యిపెట్టారు, దాంతో అందరు కుదేలయ్యారు. 

చిదానందం: మరి ఈ డిపాజిట్ చేసిన డబ్బు ఎక్కడిదంటే ఏమని చెప్పాలి? 

సదానందం: ముందుగా కిందటి సంవత్సరము, ఈ సంవత్సరంలో బ్యాంకు నుండి ఎంత డబ్బు డ్రా చేశారో చూసుకోండి, దాంట్లోంచి ఖర్చులు పోగా మిగిలినది తిరిగి డిపాజిట్ చేశామని చెప్పవచ్చు. 

చిదానందం: కొంత మంది బ్యాంకు నుండి అసలు డ్రా చెయ్యరు, వాళ్ళ దగ్గర ఇతరత్రా మార్గాల ద్వారా కొంత నగదు సమకూరుతూ వుంటుంది. 

సదానందం:   ఎంతో కొంత బ్యాంకు నుండి డ్రా చేస్తూ వుండాలి. ఇంట్లో పిల్లల పుట్టినరోజుకుఅనో, ఇతరత్రా శుభకార్యాలలో (బారసాల, అన్నప్రాశన, పుట్టినరోజు, ఉపనయనం, షష్టిపూర్తి, వగైరా) “బాగా దగ్గర బంధువులనుండి” నగదు రూపంలో వచ్చిందని చెప్పుకోవచ్చు. 

చిదానందం: మధ్యలో అసలైన వివాహవిషయం మర్చిపోయారు. 

సదానందం: లేదండీ బాబు దానికే వస్తున్నా, వివాహ సందర్భంగా ఎవరి దగ్గరనుండి బహుమతి వచ్చినా దానికి పన్ను లేదు, అయితే అది వివాహం చేసుకున్నవారి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేసుకోవాలి. 

చిదానందం: అంటే పెళ్ళికొడుకు, పెళ్లికూతురు అన్నమాటేకదా, అంటే ముందుగా ఒక పద్ధతిగా ఒక పెద్ద లిస్ట్ తయారుచేసి భలానా వాళ్ళదగ్గరనుండి డబ్బులు వచ్చినట్లుగా రాసిపెట్టుకొని ఆ డబ్బులు డిపాజిట్ చేసినట్లుగా చెప్పవచ్చు అంటారు. 

సదానందం: బాగా గ్రహించారు. 

చిదానందం: మరి ఈ మాసంలో పెళ్ళిళ్ళు వుంటే అన్నీ పాత నోట్లే భారీ ఎత్తున కవర్లో పెట్టి పేరుకూడా రాయకుండా ఇచ్చే అవకాశం వుంది. అలాంటప్పుడు ఈ మార్గాన్ని వుపయోగించుకోవచ్చు అన్నమాట. సందట్లో సడేమియా అన్న చందాన మనదగ్గర మిగిలిన నోట్లు కూడా వారి ఖాతాలో వేస్తేసరి. 

సదానందం: 30 శాతం తీసుకొని, తిరిగి డ్రా చేసి ఇచ్చేమార్గాన “మళ్ళీపెళ్ళి” చేసుకొనేవారి మీద ఆదాయపు పన్ను శాఖ వారు దృష్టి సారించాల్సివస్తుందేమోమరి. 


చిదానందం: మరి వేరే మార్గాలు లేవా బావగారు 

సదానందం: లేకేం బావగారు, గృహిణులైతే హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనో, పిల్లల పుట్టినరోజు బహుమతులనో, ఇంట్లో పెద్దవయసు వారు వున్నారు వారి అత్యవసర ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎప్పుడు కొంత నగదు ఇంట్లో పెట్టుకోవటం అలవాటుఅనో, పెద్దవారికి తరచూ బ్యాంకుకు వెళ్ళి రావటం ఇబ్బంది అనో, ఏటియమ్ లో డ్రా చేయటం తెలియదుఅనో, ఇంటి రిపేరు ఖర్చులకోసం కూడబెట్టుకున్నదనో, ఏదో ఒకటి చెప్పుకోవాలి. 

చిదానందం: మరి అధికారులు నమ్ముతారా. 

సదానందం: వాళ్ళు మనలాంటివాళ్లే కదండీ, పైగా వాళ్ళు ఈ విషయంలో బాధితులే. అయితే మీరు బ్యాంకు పాస్ బుక్ బదులు, ఆ సంవత్సరానికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వటం మంచిది. పాస్ బుక్ లో అయితే గత సంవత్సరాల వివరాలు కనబడతాయి. దాంట్లో పెద్ద మొత్తాలు వుంటే ఆరా తీస్తారు. వాళ్ళని ప్రయాసపెట్టి మనం ఇబ్బంది పడటం ఎందుకు. అనధికార చిట్స్ ద్వారా వచ్చిందని, క్యాష్ లోన్స్ అని ఎట్టి పరిస్థితులలో చెప్పకూడదు. 

చిదానందం: పాత నోట్లతో బ్యాంకు లోన్స్ తీర్చవచ్చా? 

సదానందం: కొంత మంది బ్యాంకు అధికారులు తెలిసో తెలియకో కట్టించుకుంటున్నారు. రూల్స్ ప్రకారం వారి అకౌంట్ లో వేసి అక్కడనుండి తీర్చాలి. ఇవన్నీ వారి అంతర్గత ఆడిట్ లో సమస్యలు అవుతాయి.

చిదానందం: చిన్నపాటి వ్యాపారంద్వారా అంటే టైలరింగ్ లాంటివి చెప్పుకోవచ్చు కదా 

సదానందం: చెప్పుకోవచ్చు, ముఖ్యంగా గమనించవలసినదేమిటంటే మనం డిపాజిట్ చేసిన డబ్బులు, 2016 - 2017 సంవత్సరానికి గాను ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లో మనం చూపించబోయే ఆదాయానికన్న తక్కువ వుండాలి. ఉదాహరణకు మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లో అద్దెలమీద ఒక ఎనిమిది లక్షలు చూపించారు అనుకుందాము, మీరు పదిలక్షలు డిపాజిట్ చేస్తే మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం వుంది. 

చిదానందం: మరి కొంతమంది ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లో అన్ని బ్యాంకు అకౌంట్ నంబర్స్ రాస్తున్నారు కదా, ప్రమాదం లేదా? 

సదానందం: లేదా అంటే ఒకవేళ ఇన్కమ్ టాక్స్ స్కృటిని పడితే అప్పుడు వారు అన్ని అకౌంట్ల స్టేట్మెంట్స్ చూపించమనవచ్చు. లేదా రాబోయే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ లో పాత నోట్లు ఏ అకౌంట్ లో ఎంత డిపాజిట్ చేశారు అని అడిగినా అడగవచ్చు. 

చిదానందం: అలా అడిగితే చచ్చామే 

సదానందం: అందుకనే డిపాజిట్ చేసేముందు ఆడిటర్ల సలహా తీసుకొని చేయాలి. అంతేకాని “తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి” అన్న చందాన డిపాజిట్ చేశాక మార్గాలు వెతకటం కష్టం. 

చిదానందం: మరి ఆధార్ నెంబరు తెలిపితే ఇబ్బందా 

సదానందం: కొంతమంది వారి పాన్ డేటా, ఆధార్ డేటా మ్యాచ్ అయినవారు రిటర్న్ లో వారి ఆధార్ నెంబర్ తెలియపరిచారు. అలాగే కొంతమంది  వారి ఆధార్ నెంబర్ అన్ని బ్యాంకులకు ఇచ్చివుంటారు. ఆదాయపు పన్ను వారు ఆధార్ ఆధారంగా అన్ని బ్యాంకు అకౌంట్స్ వివరాలు తెలుసుకొనే అవకాశం వుంది. అయితే వారికి ఆ అకౌంట్ లో లావాదేవీలు తెలియవు. క్యాష్ డిపాజిట్ వరకు, ఎఫ్. డి. లు వేసినా బ్యాంకులనుండి సమాచారం వెళుతుంది. ఇన్కమ్ టాక్స్ స్కృటిని పడితే అప్పడు మనం రిటర్న్ లో అకౌంట్ నెంబర్లు రాయకపోయినా, వారి దగ్గర వున్న సమాచారంతో, మిమ్మల్ని మిగతా అకౌంట్స్ తెచ్చి చూపమనచ్చు. 

చిదానందం: ముందు రిటర్న్ లో ఒక అకౌంట్ నెంబర్ చాలన్నారు, తరువాత అన్ని రాయమన్నారు, అటుతరువాత ఆధార్ నెంబర్ అడిగారు. ఇలా ఉచ్చు బిగించుకుంటూ వచ్చారు. 

సదానందం: ఒకటి మటుకు గమనించాలి. అన్ని ఆర్ధిక పరమైన లావాదేవీలమీద ఒక డేగకన్ను వేసివుంచారు. కొంతమంది తెలియక, అనుభవంలేక పెద్దమొత్తాలు వేస్తున్నారు. వారు అందరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మిమ్మల్ని తిరిగి బ్యాంకు వారు పట్టుకోగలగటానికే ఇప్పుడు ఐ.డి. ప్రూఫులు అడిగి తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పెద్దమొత్తంలో డిపాజిట్ చేసి, తిరిగి పెద్దమొత్తంలో డ్రా చేసినప్పుడు కూడా ఎందుకు డ్రా చేశారో చెప్పాల్సి వుంటుంది. 

చిదానందం: ఉంటాను బావగారు, చాలా సమయాభావం అయింది, క్యారేజీ కట్టుకొని బ్యాంకుకు వెళ్ళి లైన్లో నిలబడాలిమరి, నాలుగు రోజుల నుంచి ఇదే తంతు. 

సదానందం: సంతోషం, పాత నోట్లు జ్నాపకార్ధం కొన్ని వుంచుకోండి, ఓ ఇరవై ఏళ్ల తరువాత అవి లక్షల విలువ చేస్తాయి. 


1 comment:

  1. మంచిగా ఉన్నాయి
    థాంక్స్ అండి

    ReplyDelete