Wednesday, July 10, 2013

పిచ్చి మా రాజు - పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లు

తెలుగు సాహితీ పూలవనంలో పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో ధారావాహికంగా వెలువడ్డ ఈ వ్యాసాలు ఇప్పటిదాకా ఆరు పుస్తకాలుగా వచ్చాయి. మునిమాణిక్యం వారి కాంతంలోలాగా, పురాణం వారి ఇల్లాలి ముచ్చట్లలో కావలసినంత హాస్యం వెల్లివిరుస్తుంది. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన మొక్కపాటి వారి పార్వతీశం లోగో, అలాగే కుంపటి ముందు కూచున్న ఇల్లాలి లోగో బాగా పాపులర్ అయిన లోగోలు. విశ్వంలోని సమస్త విషయాల గురించి ముచ్చటించే ఈ ఇల్లాలి ముచ్చట్ల నుండి కొన్ని ముచ్చట్లు. 

“స్వచ్చమైన కమ్మటి పాలు తాగి ఎలాటి మంచి పనులైనా చేయవచ్చు మనం. కానీ అడ్డమైన ఛండాలపు పనులు చేయటం మాన లేకుండా వున్నాం” – గేదె మనసులు.

 “పడుచు పిల్ల కొత్త చీర కట్టుకొని తలుపు దగ్గర నిలుచుంటే ఆ తలుపు కాస్త ఓరవాకిలిగా తీసివుంటే చూడ్డానికి ఎంతో బావుంటుంది. గుమ్మాల దగ్గర ఆడవాళ్ళు నిల్చుంటే గుమ్మలు అందంగా వుంటాయి” – రాదే చెలీ నమ్మరాదే చెలీ 

 “చదువుకున్న ఆడవాళ్ళు మా చదువుకోని స్త్రీలను చూసినంత హీనంగా మీ చదువుకున్న మగాళ్లు చదువుకోని పురుషులను చూడరు” – రేపటి ఆకాశంలో ఆశల హరివిల్లు.

 “మీరు నేనుగా ఉన్న మనల్ని మనంగా మార్చేసిన ఇరవై ఉగాదులు ఎక్కడకు వెళ్ళినట్లు చెప్మా” – ఆ ఉగాది మళ్ళీ వస్తుందా 

 “చంటి పిల్లలు ఏడాది దాటిన పిల్లలు మామిడి పండు తింటుంటే చూడ ముచ్చటగా వుంటుంది. పొట్టనిండా మూతి కళ్ళూ చేతులూ తొడలూ అంతా రసం కారిపోతూ వాళ్ళు ఆనందిస్తుంటే చూసే వాళ్ళ జన్మ ధన్యం. ముద్దు తియ్యగా వుంటుందో లేదో తెలుసుకోవాలంటే ముందు చిన్న పిల్లల్ని ముద్దు పెట్టుకు చూడాలి. ప్రేమ గాఢంగా ప్రయాణంచేసి మాతృత్వం దగ్గరకొచ్చి స్టాపవుతుంది. తల్లి గుణం ప్రేమించే గుణం ఈ రెండూ లోపించిన తరువాత మనుషులు పందులకంటే హీనంగా జీవిస్తారు” – సువ్వరోపాఖ్యానం

 “ఆవకాయకు గేదె పెరుగు జోడించి చద్దెన్నం కొట్టేస్తే ఆమత్తులో ప్రపంచం మరోలా కనిపిస్తుంది. ఎండ బెట్టిన మాగాయ ముక్కలు చీకుతూ వుంటే – ఈ మొగుడెందుకు ఈ కాపరమెందుకు ఈ పిల్లలెందుకు ఇదంతా మాయ మిధ్య - ఈ మాగాయ ముక్క ఒక్కటే నిజం, ఇదే కూడా స్వర్గం దాకా వచ్చేది” – అలివేణీ – తరవాణీ

 “ప్రజాస్వామిక ప్రభుత్వాలు గాజులు తొడిగించుకు కూర్చుంటే, ప్రతి స్వల్ప విషయానికి కేంద్రంవైపు వెర్రిమొహాలేసుకొని చూస్తుంటే నలికెళ్ళ పాము గూడా ఆదిశేషుడులా బుసలు కొడుతుంది” – సరస సామదాన ........

 “మనసులోని కోరికలకు నిద్రలో పూసిన పూలు కలలు” – కలగంటి కలగంటి

 “నిద్దట్లో గూడా ఏకపత్నీ వ్రతమే ఏడవమంటావా. మేనర్సు పరాయివాళ్ళ దగ్గర చూపెట్టటానికి, సొంత మనుషుల దగ్గర మేనర్సు ఎందుకు” - మా వారి స్వీట్ డ్రీమ్స్ 

 “ఆధునిక సమాజంలో మనిషి తన అసమర్ధత ఋజువు చేసుకొనే స్థితి వరకూ ఎదుగుతాడు” – పీటర్స్ ప్రిన్సిపుల్ 

 ఇలాంటివి ఈ ముచ్చట్లలో కోకొల్లలు. పురాణం వారిది ఇల్లాలి ముచ్చట్లే గాక “జల తరంగిణి” అనే రచన గూడా వుంది. దాని నిండా కావల్సినన్ని కబుర్లు. 

చివరగా 06-09-1974 ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చిన “పిచ్చి మా రాజు” అనే ముచ్చట చూద్దాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి చిన్న పుస్తకంగా వచ్చేది. ఇది ఇంతకు ముందు ప్రచురించిన ఆరు పుస్తకాలలో వచ్చినట్లుగా లేదు. ఇది చదివాక 1976లో వచ్చిన శోభన్ బాబు గారి “పిచ్చి మా రాజు” సినిమా గుర్తుకు వస్తుంది. మరి దీన్నే సినిమాగా తీశారా అన్న విషయం తెలియదు.No comments:

Post a Comment