తెలుగు సాహిత్యంలో ప్రహసనములకు ప్రత్యేక స్థానం ఉంది. ఆద్యంతము హాస్యము ధ్వనించేలా సాగే ఈ రచనా ప్రక్రియలో మనకు ముగ్గురు రచయితలు కనబడతారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. పానుగంటి వారి ప్రహసనాలు ఎప్పుడు కళ్ల జూడ లేదు. వెనుకటికి ఎవరో అన్నారు కందుకూరి వారి ప్రహసనాలలో పేరులో తప్ప ఎక్కడా నవ్వు ధ్వనించదని. చిలకమర్తి వారి ప్రహసనాలు చాలా బావుంటాయి. అందులో ముఖ్యమైనది “బధిర చతుష్టయ ప్రహసనము”. సంభాషణా రూపంలో నాటకం లాగా కనబడుతుంది. మిగుల నవ్వు వచ్చు నాటకమేదైనా రచింపమని పిఠాపురం రాజావారు కోరినప్పుడు పానుగంటివారు ‘కంఠాభరణము” నాటకాన్ని రాశారుట. తట్టుకోలేని వారు చదవకండని ఎమెస్కో వారు ప్రచురించారు. కడుపు చెక్కలయ్యేలా సాగుతుంది ఈ నాటకం.
సరే విషయానికి వస్తే మునిమాణిక్యం వారిది “మన హాస్యము” అనే అద్భుతమైన రచన వుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1968లో ప్రచురించారు. మనిమాణిక్యం వారి పుస్తకాలన్నీ చాలా ఏళ్ల కిందటే పునర్ముద్రించారు. ఈ మన హాస్యం మటుకు ఈ మధ్యనే పునః ప్రచురణకు నోచుకుంది. హాస్యం మీద అనేక పుస్తకాలు చదవటం అనవసరం. ఒక్క మునిమాణిక్యం వారి మన హాస్యం చాలు, వంద పుస్తకాల పెట్టు. దాంట్లో మడికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంది. దీన్ని మునిమాణిక్యం వారు పానుగంటి వారి ప్రహసనముల నుండి గ్రహించారుట. మడి అనే మాట బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే వినబడుతుంది. శుచి, శుభ్రతలకోసం ఏర్పాటు చేసిన ఆచారము ఇది. చాలా మంది ఇళ్ళల్లో దండెము అని వెదురు గడ ఒకటి పైన కట్టి ఉంటుంది. స్నానం చేశాక మర్నాటి కోసం అని ఒక తడిబట్ట దండెం మీద ఆరవేసేవారు. అందనంత ఎత్తులో వుంటుంది కనుక పిల్లలు ముట్టుకో లేరు. కర్రతో బట్టను దండెం మీద ఆరవేసేవారు. సంధర్భాన్ని బట్టి మడిలో రకాలు ఉన్నాయి. పసిపిల్లలున్న తల్లులకు మినహాయింపులుంటాయి. ఈ మడి ఆచారాభాసము ఒకసారి ఆస్వాదిద్దాము.
No comments:
Post a Comment