Saturday, August 2, 2014

గార్ధభమహాశయులతో మాటా మంతీ

ఊళ్ళోకి మందులోళ్లు గాడిదలేసుకొచ్చారంటే మా మాలోకం, నేను ఒకసారి చూద్దామని అలా ఊరి పొలిమేరలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక ఖరముగారు ఏకాంతంగా సంగీత సాధన చేస్తూ కనిపించారు. చెప్పాను గదా మా మాలోకానికి మానవేతర భాషలు వచ్చని, వాడు ఆ ఖరముతో నెఱపిన సంభాషణ చూడండి. 


అంతర్జాలం నుండి

సుస్వర ఖర గానఝరి -  మాలోకం
ఆహా ఏమి గానమాధుర్యము
గాడిద
ఎంతకాలానికి నా గానాన్ని మెచ్చుకున్నవారు అగుపించారు. నా ఈ జీవిత చరమాంకంలో ఒక్కరన్నా మెచ్చుకోకపోతారా అని ఎదురు చూస్తున్నాను.
మాలోకం
మరి ఇలా ఏకాంతంగా ఆలపిస్తున్నారు
గాడిద
మరి ఏంచేసేది గానమాలాపించగానే బడితుచ్చుకుంటున్నారు. అదే మీలో అలా చేస్తారా
మాలోకం
మేం మరోలా చేస్తాముగాని, మాలో గూడా చాలా మంది ఈ సుస్వర స్వరము అలవడేదాకా ఇలా ఏకాంత సాధన చేస్తుంటారు 
గాడిద
మాలా పాడగలిగే చతుష్పాదులున్నాయా?
మాలోకం
ఎంత మాట, మా గ్రామసింహాలకు శోకరాగం ఒకటేవచ్చు. మిగతా వాటికి ఏదో అరవటంతప్ప మీలా ఏకబిగిని ఎత్తిన గళం దించకుండా అరవటం అదే పాడటం వాటి తరమా
గాడిద
ఏంలాభం ఈ మోత బరువులతో జీవితం చాలా ధుర్భరమైపోతోంది.
మాలోకం
అవును మేంగూడా పెనుభారం మీద పడ్డప్పుడు మరీ గాడిద బ్రతుకు అయిపోయిందనుకుంటాము. అవును అంత భారం ఎలా మోస్తారు?
గాడిద
ఏంచేస్తాం మా ఖర్మ. అందుకే ఒక్కోసారి మొరాయిస్తాము.
మాలోకం
మా పిల్లకాయలు అంతే గాడిదబరువు మొయ్యలేక  ఇస్కూలుకు వెళ్ళటానికి మొరాయిస్తారు.  మీరు పనిఎగ్గొట్టి తిరుగుతుంటారని విన్నాను.
గాడిద
మీలో అలా తిరిగేవాళ్లు లేరా?
మాలోకం
లేకేం వాళ్లను మావాళ్లు మీవాళ్ళతో పొలుస్తుంటారు.
గాడిద
నేను పిల్లను గదా పెట్టేది, మీరు గాడిద గుడ్డు అంటారేమిటి?
మాలోకం
ఓ అదా, ఆంగ్లేయులు వచ్చిన కొత్తల్లో మావాళ్ళచే గాడ్ ఈజ్ గుడ్ అని వల్లె వేయించేవారుట.  దాన్ని మా వాళ్ళు అతివేగంగా వల్లె వేసి వేసి దాన్ని గాడిదగుడ్డు కింద మార్చేశారు.  నీ పక్కనున్న పిల్ల ఎవరు?
గాడిద
మా చిన్నమ్మాయి
మాలోకం
ఎంత ముద్దుగా, చలాకీగా వుంది. అసలు నన్నడిగితే మీ పిల్లలకున్న అందం మా ఆవు పిల్లలకు కూడాలేదు.
గాడిద
మీ అభిమానం అలాంటిది.
మాలోకం
మీరు అంత నిశ్చలంగా ఎలా ఉంటారు.
గాడిద
మేము గంటల తరబడి ధ్యానంలో వుంటాము. ఎవరూ మమ్ము కదల్పలేరు.
మాలోకం
ఆదేనా జోరున వానబడుతున్నా  అలాగే  నిశ్చలంగా   వుంటారు. 
గాడిద
మీ యోగసాధన  మానుండి గ్రహించినదే
మాలోకం
అయిండొచ్చు సుమా, మా వాళ్ళు పక్షులు, జంతువులనుండి చాలా నేర్చుకున్నారు, ఒప్పుకోటానికి అహం  అడ్డొస్తుందిగాని.           అవును     ఆడ్డ, నిలువు గాడిదలుంటాయా?
గాడిద
నేను భూమికి ఎలా వున్నాను?
మాలోకం
సమాంతరంగా అదే అడ్డంగా
గాడిద
మరి మీరో?
మాలోకం
నిటారుగా అదే నిలువుగా
గాడిద
అది వ్యత్యాసం
మాలోకం
ఇంత సూక్ష్మ విషయాన్ని ఎంత చక్కగా అవగతంచేశారు. మరి కంచర గాడిదలు మీకు బంధువులా?
గాడిద
ఎందుకు పనికిరాని వాటికి మాకు పోలికేంటి. అవి సంకర గాడిదలు
మాలోకం
బహుశ: కాలగమనంలో సకారము చకారము క్రింద మారి, స్థానభ్రంశమొందియుంటాయి.
గాడిద
అవి హాయిగా అడవుల్లో స్వేచ్చావాయువులు పీలుస్తుంటే, మా బ్రతుకు ఇలా జనవాసాల మధ్య నలిగిపోతోంది
మాలోకం
మీరు అడవులకు పోవచ్చునుంగదా?
గాడిద
మా పూర్వీకులు అడవులనుండే వచ్చారు.
మాలోకం
కారణం  బెట్టిదో
గాడిద
ఏముంది మాగానకౌసల్యానికి, మా పాదతాడనానికి మృగరాజు శరణుజొచ్చి మేమక్కడుంటే తన పఱువు పోతుందని కాళ్లావేళ్లా పడటంతో  ఇలా తరలి వచ్చారు
మాలోకం
నీ పాలబడి మాలో పళ్ళూడగొట్టుకున్న మారాజులు చాలామంది వున్నారు. మా మహారాజులు   గజ, అశ్వ దళాలతో పాటు గార్ధభ దళాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసి వుంటే బావుండేది. అంత బలం మీకు ఎలా వస్తుందో
గాడిద
మా రక్తంలో ఉంది. మేము తాగిన పాలు అలాంటివి.
మాలోకం
నిజమే సుమా, ఈ మధ్య మావాళ్లు ఆవుల్ని, గేదల్ని వదలి గాడిద పాలమీద పడ్డారుట. ఎక్కడో చదివాను, ప్రపంచ వ్యాప్తంగా ఆవుపాల మీద పెద్ద మాఫియా నడుస్తోందిట. నిజానికి ఆవుపాలు ఎందుకు కొఱగావుట. సకల వ్యాధులకు కారణభూతం ఆవుపాలుట. అబద్ధం అనుకుంటే మీరే చదివి తెలుసుకోండి,  http://www.notmilk.com చదివాక గంగి ఖరము పాలు గరిటెడైనను చాలు,డివెడైననేమీ గోవుపాలు అని గ్రహించకమానరు  
గాడిద
ఈ విషయంలో మీ వాళ్ళు మాకు చాలా అన్యాయం చేశారు
మాలోకం
నిజమే ఆవుకు నీకు వ్యత్యాసమేమున్నది. “ఆవు పేర్లో రెండు ఖరము పేర్లో మూడక్షరాలు. ఇంతకంటే ఎక్కువ ఏంకావాలి,  నువ్వు గొప్ప అని గ్రహించటానికి.   ఆవు పొందే గౌరవానికి నీవు అర్హురాలవే.
గాడిద
భగవంతుడు గూడా చెప్పొద్దూ చాలా చులకనగా చూశాడు
మాలోకం
కాక, గణపయ్యకు ఎలుకా, కుమారయ్యకు నెమలా, విష్ణువుకు గద్దా ఇలా బలహీనమైన వాటిని వాహనాలుగా చేసుకొని  వూరేగకపోతే ఒక్కళ్లన్నా ఇంత బలశాలి వైన  నిన్ను పెట్టుకోనుంటే, మావాళ్లు నీకు బ్రహ్మరధం పట్టేవాళ్ళు గాదూ
గాడిద
మీ పంచతంత్ర కర్త విష్ణుశర్మ గారు గూడా మాకు చాలా ద్రోహం చేశారు.
మాలోకం
ఆయన ఎలా చేసుంటారు చెప్మా
గాడిద
ఏముంది దొంగ వస్తే కుక్క చెయ్యని పని నేను చేసి యజమానికి మేలుచేస్తే దాన్ని వక్రీకరించి రాసి మాకు దెబ్బలు పడేలా జేశాడు.
మాలోకం
ఎంత చక్కగా గ్రహించారు. సవరించలేని అపరాధం జరిగిపోయింది. అందువల్లనో ఏమో దానికి ఫలం మేము అనుభవిస్తూనే వున్నాము. మాకు మంచికిబోతే దెబ్బలు తగులుతూనేవున్నాయి.
గాడిద
మాకంటే    అశ్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు
మాలోకం
నేను అదే చెబుదామనుకుంటున్నాను, వెధవ గుఱ్ఱాలు కళ్ళకు గంతలు కడితేగాని ముందుకు జావలేవు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి.  మీరలాగాదే, మీమీద అధిరోహించి   వస్తుంటే  ఆ ఠీవి, రాజసం చూసి జనం మూర్ఛపోరు. వెనుకటికి మా చిలకమర్తి వారి గణపతి మిమ్మల్ని అధిరోహించి స్తుతించారు
గాడిద
మాకు సరైన గుర్తింపే ఇవ్వలేదు మీవాళ్లు 
మాలోకం
నిజమే, అదేదో దేశంలో మీకు విగ్రహం నెలకొల్పారుట, మావాళ్లున్నారెందుకు ఆఖరుకు ఒక్క ష్టాంపన్నా మీపేరున విడుదలజేసినట్లులేదు, పనికిమాలిన పులికి పట్టంగట్టారుగానీ. 


గాడిద
వాన రాకడ మాకు తప్ప ఎవరికీ తెలియదు.
మాలోకం
మా వైద్యులు  అతికష్టంమీద ప్రాణంపోకడ తెలుసు కున్నారుగానీ, మీకు   ఎలా  సాధ్యం
గాడిద
ప్రకృతి పరవశించినపుడు మాకు ముందే అవగతమవుతుంది.  దానికి మేము పరవశించి ఇదిగో ఇలాగ ----------------------
మాలోకం
మీరు గానమాలాపించటం పూలవాన బడటం, ఆహా పరవశమాయెగదా నాలోన ఆనందమాయెనహా నాలోన ఆహా ---------------------------- 
గాడిద
ప్రకృతి, నేను, మీరు ఒకేసారి పరవశంబొందాము  చూశారా
మాలోకం
ఎంత సుదినం, మీలాంటి నలుగురిని మా  వాతావరణ శాఖ వారికి  అప్పగిస్తే వాన రాకడ ఇట్టే తెలిసిపోతుంది.
గాడిద
అలా చెయ్యండి బాబు, మీ పేరు జెప్పుకొని మా పిల్లాజెల్లా సుఖపడతారు. ఈ పాడు పని చెయ్యలేక చస్తున్నాము. మాకు ఒక ఉపాధి అంటూ ఒకటుంటుంది.  మీలో గూడా గాడిదలున్నారా?
మాలోకం
ఎంత మాట లేకేం  కూసేవారు, మెసేవారు అని రెండు తెగల వాళ్ళు వున్నారు. వాళ్ళు ఒకళ్ల పనులు ఒకళ్ళు ఎప్పుడూ  చెడగొట్టుకుంటూ వుంటారు.  చూస్తుంటే మీజాతి అంతరించి పోయేలా వుంది. చివరకు మా పిల్లలకు మీలాంటి  నాలుగు కాళ్ళ గాడిదను చూపించాలంటే ఏ జంతుప్రదర్శనశాలకో వెళ్లాల్సివచ్చేటట్లుంది.
గాడిద
బర్రెలను కొంటానికి అప్పు ఇచ్చినట్లుగా గాడిదలను కొంటానికి ప్రభుత్వం మా విషయంలో కలుగజేసుకోవాలి. మాజాతి అభివృద్ధికి ఆమాత్రం ఇతోధికంగా తోడ్పడితే మా వంశాభివృద్ధి మేం చకచకా గావించుకుంటాము.  
మాలోకం
ద్వాపర యుగం నాటి అనుబంధం మనది మీ జాతి లక్షణాలు పుణికిపుచ్చుకున్న వారు  అంతర్లీనంగా మా జాతిలో చాలమందే వున్నారు.  మీ గానామృత ధారలతో తడిసిముద్దయ్యాను. కాలమాసన్నమయింది.  చాలా చక్కటి విషయాలు తెలియజెప్పారు.  సెలవుచ్చుకుంటాను
గాడిద
పునః దర్శన ప్రాప్తిరస్తుNo comments:

Post a Comment