Friday, January 16, 2015

కుక్కరొట్టె ప్రహసనం

బయటకెళ్లి ఆడుకోనివచ్చి అప్పుడే ఇంట్లో అడుగుపెట్టాను నెయ్యివేసి కాల్చిన మినపరొట్టె వాసన ముక్కుపుటాలను తాకింది. కుక్కకు రొట్టె వెయ్యాలి, పోయి ఎక్కడినుంచైనా కుక్కను పిలుచుకు రమ్మన్నారు ఇంట్లో వాళ్ళు. ఏడాదిలో ఒకసారి ఇదో ప్రహసనం మా చిన్నప్పుడు. అదేదో పండగో, తిధో వచ్చేది, ఆ రోజు రొట్టెను ముందుగా మనం కొరికి, ఆ కొరికిన ముక్కను కుక్కకు వెయ్యాలిట. అలా మూడుసార్లు చేశాక ఆ తరువాతనే రొట్టెను మనం తినాలి అనేవారు. ఎందుకంటే, మనదంతాలలో విషముంటుంది అంటూ ఏదో చెప్పేవారు. ఇంట్లో కుక్క ఉంటే ఆ దారే వేరు. బయట రోడ్డు మీద కుక్కను తీసుకు రావాలి. ఆ మాట కొస్తే దాన్ని ఇంటిదాకా తేవటం ఒక కళ. దీనికి కొద్ది పాటి అనుభవం కూడా కావాలి. 

ముందుగా సరిఅయిన గ్రామసింహాన్ని ఎన్నుకోవాలి. అది మన కనుసన్నలలో మెలిగేట్లుగా చూసుకోవాలి. ముఖ్యంగా దానికి తోక ఉండాలి. కుక్కన్నాక తోక లేకుండా ఉంటుందా అని మీరు అవహేళన చేయవచ్చు. ఈమధ్య అమెరికావాడు పెద్దపరిశోధనచేసి కుక్క స్వభావాన్ని దాని తోకచూసి గ్రహించవచ్చు అన్నాడు. ఈపాటి విషయం నాకు చిన్నప్పుడే తెలుసు. తోక ఎందుకాన్నానంటే మొండితోక కుక్కలను అంచనావేయటం చాలాకష్టం. అసలు కుక్కతోక ఊపిందంటేనే అట్టే భయంలేదని అర్ధం. తోకతోపాటు కొంచెం శుచిశుభ్రత పాటించే కుక్కలను చూసుకోవలె. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ కుక్కలు ఉన్నట్లయితే ఒక దానిని వేరు చేయవలె. కొంచెం ఈల వెయ్యటం కూడా వచ్చి ఉండాలి. అదికూడా కొంచెం లయ బద్ధంగా వెంటవెంటనే వేస్తే దాని దృష్టి మనమీదపడే అవకాశం ఉంటుంది. ఇంత ఎందుకు చెబుతున్నానంటే మా పక్కింటి కామేశం ఇలాగేవెళ్ళి కుక్కను పిలవబోయేసరికి అవి అమాంతం మీదపడి కొరికినంత పనిచేసి రొట్టెను చక్కాలాక్కెళ్ళి పోయాయి, వాడు బిక్కమొహం వేసుకొని ఏడ్చుకుంటూ ఇంటి మొహం పట్టాడు. 

అందుకనే ముందుగా దానికి రొట్టె కనబడనివ్వ గూడదు. రొట్టెను ఒకచేత్తో వెనకాల దాని కళ్ళబడకుండా దాచి పెట్టుకొని, అది చూస్తుండగా ఒక చిన్నపాటి ముక్కను మననోట్లో పెట్టుకుంటే, ఈ వెధవ ఏదో తింటున్నాడు నాకేమన్నా పెడతాడేమో అన్నభావన దానికి కలుగుతుంది. తరువాత ఆ ముక్క దానికి పడేస్తే అది తింటానికి వస్తుంది. ఆ విధంగా మనం దూరదూరంగా జరుగుతూ దాన్ని ఇంటిదాకా పట్రావాలి. అయితే దుమ్ముధూళి లేనిచోట పడేస్తే దానికి కొంచెం రుచిగ్రహించే అవకాశం వుంటుంది. చూశారా దీనికి ఎంత ప్రణాళిక కావాలో. ఈ లోపల ఇంటిల్లిపాది బయట కుక్కగారి కోసం రొట్టెలు పట్టుకొని వేచిఉండేవాళ్లు. ఇంతమందిని చూడగానే వీళ్ళేదో కొట్టేటట్టున్నారని అది నాలుగడుగులు వెన్నక్కివేసేది. ఒకళ్ల తరువాత ఒకళ్లను రమ్మని వాళ్ళను లోపలికి పంపితే దానికి కొంచెం నమ్మకం కుదిరి లోపలికి వచ్చేది. అసలే నెయ్యివేసి కాల్చిన మినపరొట్టె. దాని వాసనకే నోరూరేది. ఎప్పుడు కుక్కకు పెట్టి తినాలా అని చూసేవాళ్లం. ఈ విధంగా ఒక రెండు రొట్టెలు లాగించి అది సంతుష్టురాలై లోపలేదో దీవించుకొని చక్కాపోయింది. 

మర్నాడు బజారు నుండి వస్తుంటే దార్లో ఆ కుక్క నన్ను చూసి అమాంతం లేచినిలబడి శరీరమంతా కదలిపోయేలా తోక ఊపుతూ నా దగ్గరకు వచ్చి ముందు రెండుకాళ్లుజాచి చిన్నపాటి సాష్టాంగదండప్రణామంబు గావించి, లేచి నిలబడి దాని అభిమానాన్ని ప్రకటించింది. ఆహా కుక్క విశ్వాసముగల జంతువని పెద్దలు ఊరికే అన్నారా మరి అనుకున్నాను. వీధిలోకి వస్తే మన్ని గుర్తించి ఆ మాత్రం లేచి నిలబడి నమస్కారం చేయటటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. పర్లేదు మనకి సంఘంలో కొంచెం గుర్తింపువుంది అనుకున్నాను. నాతోపాటే వెనకాలే ఇంటిదాకా వచ్చి దింపింది. సరే పాపం నోరులేని జంతువుగదా అని కొంచెం అన్నం పెట్టాను. మొదట చక్కగా ఆవకాయ కలిపి పెడదామనుకున్నాను. కానీ ఖారం తినలేదోమోనని ఆగాను. ఈ లోపల మా మేనల్లుడు బయటనుండి వచ్చి ఛీ ఫో అంటూ, వద్దంటున్నా వినకుండా దానిమీదకు రాయి విసిరాడు. అది అట్టే తృటిలో తప్పించుకొని వీధిలోకి రండి మీపని చెబుతాను అని అర్ధంవచ్చేలా ఒక చూపుచూసి వెళ్లిపోయింది. 

మర్నాడు ఇద్దరం స్కూలు నుండి వస్తుంటే ఆ కుక్క దార్లో ప్రత్యక్షం అయింది. నన్నక్కడ ఒదిలేసి మా మేనల్లుడు పరుగు లంఖించుకున్నాడు. కుక్క నావంకే చూస్తోంది. ఇలా దారికాయటం, లేచినిలబడిన విధానము, తోక ఊపకపోవటం అన్నీ చూస్తుంటే నిన్న మావాడు రాయి విసిరిన ప్రభావం అనిపించి, ఇది మనసులో పెట్టుకొని నన్ను కరవదు గదా అనుకుంటూ, దానిలో చేతనత్వం తేవటానికి చిన్నపాటి ఈల వేశాను. తోకలో చలనం లేదు. దూరంనుండి మావాడు పరిగెట్టుకురా అని కేక. వాడంటే మాఊరు చదువుకోటానికి వచ్చాడు. నెలరోజుల్లో వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ ఉండేవాడిని. కుక్క వెంటబడుతుండగా పరుగెడితే ఊళ్ళో నా పరువేంగావాలి. ఆడపిల్లలు నన్ను చూసి నవ్వరా. ఇలా లాభం లేదు దీంతో సంధి కుదుర్చుకోక పోతే కష్టం అని ఆలోచించి, ఎంతైనా ఇలాంటి విషయాలలో అనుభవశాలిని కనక, అంతో ఇంతో ఎంతో కొంత తెలివితేటలు ఉన్నాయిగాబట్టి దీనికో బిస్కెట్టు ముక్క పడేద్దామని జేబులోకి చేయి పోనీయగానే తోకలో చలనం కనబడింది. దానికో ముక్క పెట్టి దాని తలనిమిరి ఇంకెప్పుడూ ఇలా జరగదన్నట్లుగా చెప్పి దాని కోపం శాంతింపచేసి ఒక్క విశ్వాసమే కాదు అపకారికి కూడా హాని చెయ్యని దాని విజ్ఞతను చూసి మానవుడు ఎప్పుడు నేర్చుకుంటాడో గదాయని ఆలోచిస్తూ కుక్క వెంటనడువుగా గృహోన్ముఖుణ్ణి అయ్యాను.

1 comment: