Wednesday, January 21, 2015

విశ్వనాధ వారి విష్ణుశర్మ పునరాగమనం

విష్ణుశర్మ: అయ్యా 

విశ్వనాధ: ఎవరయ్యా అది ఈ వేళగాని వేళప్పుడు, చెయ్యి వీలుగాలేదు మరో ఇల్లుచూసుకో 

విష్ణుశర్మ: నేనండి విష్ణుశర్మను 

విశ్వనాధ: ఏ విష్ణుశర్మ వయ్యా నువ్వు? పప్పుభొట్ల వారబ్బాయివా? మీ నాయనకేం కాలేదుగాదా? 

విష్ణుశర్మ: నేనండి మహాప్రభో, కలలో మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నాను 

విశ్వనాధ: క్షమించాలి మీరా, మళ్ళీ దాపురించారా నా ప్రాణానికి, వస్తునట్లు ముందుగా కలలోనన్నా కనబడ్డారు కాదు. ఇంతకీ ఇది కలా నిజమా. 

విష్ణుశర్మ: గిచ్చి చూడండి, యదార్ధం గోచరిస్తుంది. 

విశ్వనాధ: ఎవర్ని మిమ్మల్నా, నన్నా. ఇంతకీ ఒక్కరేనా, తిక్కన్నగారు వెనకాతల ఉన్నారా? రండి కూర్చోండి. 

విష్ణుశర్మ: ఈ మటుకు ఒక్కడినే వచ్చాను లేండి. ఆ చింకిచాపా, నులకమంచం అలాగే ఉంచారు. మా జ్ఞాపకార్ధం కాదుగాదా 

విశ్వనాధ: ఉపాధ్యాయ వృత్తిలో మా జీతాలు, అవి తెలిసినవే కదా. మళ్ళీ ఆక్షేపణ గూడాఎందుకు 

విష్ణుశర్మ: మీలో వృధాప్య లక్షణాలు వచ్చేసినై 

విశ్వనాధ: మీలా సురలం గాదుగాదా, ఎల్లవేళలా ఒకే రీతిగానుండటానికి. ఏకంగా ఈమారు సరాసరి మానవరూపంలో ఏతెంచారు. తిక్కనగారు ఏంచేస్తున్నారు. స్వర్గలోక వివరాలు చెప్పారు కాదు. 

విష్ణుశర్మ: ఏది మీరేదో ఔషధులు సేవించి పరుండటంతో ముందు కలలో కనబడ్డానికి కుదిరింది కాదు. మీ దగ్గర నేర్చుకున్న నాలుగు ముక్కలతో, అక్కడ మాచే దేవేంద్రుడు గారు “మహేంద్ర ఆంగ్ల కళాశాల” నొకటి స్ధాపించి దేవతలకు ఆంగ్లం నేర్పటానికి మమ్ములను ఉపాధ్యాయులుగా నియమించారు. 

విశ్వనాధ: ఏమిటీ ఆ నాలుగు ముక్కలతోనే? 

విష్ణుశర్మ: మీతో చెప్పాము కాదు, “అశోక ఆంగ్లేయ బోధిని ” అనే పుస్తకాన్ని పోతూపోతూ చక్కా పట్టుకుపోయాము. 

విశ్వనాధ: ఈ మాత్రం దానికి నన్ను ఏడిపించుకు తిన్నారు గదయ్యా ఇద్దరూనూ. ఇంతకూ తిక్కన్నగారి విషయం చెప్పారు కాదు. 

విష్ణుశర్మ: ఆయనకేం లేండి, ఆ కళాశాలకు వారే అధ్యక్షులు. 

విశ్వనాధ: అదేమిటి వయస్సులో మీరు పెద్దగదా 

విష్ణుశర్మ: మీరు గ్రహించలేనిది ఏముంది అంతా రాజకీయం చేశారు. 

విశ్వనాధ: భారతం రాసిన వారు ఆ మాత్రం రాజకీయం చేయలేరా ఏమిటి. ఊరక రారు మహాత్ములు, వచ్చిన కారణం చెప్పారు కాదూ 

విష్ణుశర్మ: ఇంగ్లీష్ లో నూతన అంశాలు నేర్చుకు రమ్మని మహేంద్రుల వారి ఆనతి. 

విశ్వనాధ: “24 గంటల్లో ఆంగ్ల భాష” అనే నూతన పుస్తకం వచ్చింది. అది చూడక పోయారా 

విష్ణుశర్మ: గురుముఖః గ్రహిద్దామని 

విశ్వనాధ: మళ్ళీ నన్నే గురువును చేసుకుంటారా ఏమిటి. నావల్ల కాదు 

విష్ణుశర్మ: అంతమాట అనకండి. వేరే దారి లేదు. ఈసారి మిమ్మల్ని అట్టే ఇబ్బంది పెట్టనులేండి. 

విశ్వనాధ: ఎక్కడదిగారేమిటి. ఈసారి ససేమిరా మా ఇంట్లో ఉండే అవకాశమే లేదు. 

విష్ణుశర్మ: ఈ మధ్య స్వర్గానికి వచ్చిన ఆయన ఒకరు చెప్పారు, ఇక్కడ “మహేంద్ర సన్నిధి” అనే హోటల్ వుంది. అక్కడ దిగండి బావుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడ దిగి ఇలా వస్తున్నాను. భోజనం అరిటాకులో పెడతారుట. 

విశ్వనాధ: మరి పడుకోటానికి ధర్భపుల్లలతో నేసిన చాప వేస్తారేమో కనుక్కున్నారా 

విష్ణుశర్మ: ఏంచేస్తాం, పరిస్థితులబట్టి సర్దుకుపోవాలి. వచ్చేటప్పుడు ఆ హోటల్ వాడితో చిన్న వాగ్వివాదం జరిగింది. 

విశ్వనాధ: ఏ విషయంలో 

విష్ణుశర్మ: వాడు “హోటల్” అని తెలుగులో వ్రాసి “Hotel” అని ఇంగ్లీష్ లో వ్రాస్తే అలాకాదు “Hotal” అని వ్రాయాలంటే, పోవయ్యా పెద్ద చెప్పొచ్చావు అని తరిమేశాడు. 

విశ్వనాధ: ఇంకేం మొదటి పాఠం అయిపోయిందన్నమాట. నన్ను ఇలాగే కాల్చుకు తిన్నారు గదండీ ఇద్దరూనూ. 

విష్ణుశర్మ: వస్తూవస్తూ పలక కూడా తెచ్చుకున్నానండి. పావలా చేతిలోపెట్టి పలకా, బలపం ఇవ్వమంటే ఆ యొక్క కొట్టువాడు నన్ను పైనుంచి ఎగదిగా చూసి పదివేలు పుచ్చుకొని ఇదే పలక అని ఇచ్చాడు. బలపం ఏదిరా నాయనా అంటే వేలుతో రాసుకోపో అన్నాడండి. దీన్ని ఎలా వాడాలో మీరే చెప్పాలి. 

విశ్వనాధ: పలకలు పోయి చాలాకాలమయింది. దీన్ని స్లేట్ అంటారు. ఇప్పుడు బొడ్డూడని వాడి దగ్గరనుంచి ఇదే వాడుతున్నారు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్స్ యుగం. 

విష్ణుశర్మ: స్లేట్, ఎలక్ట్రానిక్స్ అంటే ఏమిటి. వాటి స్పెల్లింగ్ చెప్పారు కాదు. 

విశ్వనాధ: మీతో వచ్చిన తంటా ఇదేనండి, నోట్లోంచి ఒక్క ముక్క ఆంగ్లమాట వచ్చిందా ఇట్టే పట్టుకు కూచుంటారు. పలకనే ఇంగ్లిష్ లో స్లేట్ అంటారు. ఇక దాని స్పెల్లింగ్ అంటారా “Slate” అని రాయాలి 

విష్ణుశర్మ: అయ్యా మీరేమన్న స్లేట్ అంటున్నారు, నాకేమన్నా “శ్లాటే” లాగా అగుపిస్తోంది, దాని బదులు “Slet” అని రాస్తే సరిపోతుంది కదా, చివర్లో అనవసరంగా ఆ ఇకారమెందుకు అని సందేహం. 

విశ్వనాధ: మీ సందేహాలు కాదు గాని నా దుంప తెంచుతున్నారు కదండీ. ముందా ఆ పలక మూల పక్కన పెసరబెజ్జంత బటన్ ఉంది, దాన్ని ఓపరి నొక్కండి. 

విష్ణుశర్మ: ఇదేంటండీ నల్లటి పలక వెలుగులు విరజిమ్ముతూ ఇలా అయిపోయింది. 

విశ్వనాధ: ఆ దాంట్లో ఆ కనబడే నోట్పాడ్ అన్నదాని మీద వేలుపెట్టి నొక్కండి, దీనిమీదండీ బాబూ 

విష్ణుశర్మ: ఇదిదో తెల్లకాగితంలాగా మారిందే 

విశ్వనాధ: దాని మీదే వేలుపెట్టి ఏది రాస్తే అది కనబడుతుంది. 

విష్ణుశర్మ: ఇదేదో చాలా బావుంది, వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఓ నాలుగు పట్టుకు పోతాను, మా మహేంద్రుల వారు అచ్చెరువొందుతారు. 

విశ్వనాధ: ఇవి అక్కడ పనిచెయ్యవు కానీ సూర్యరశ్మితో పనిచేసే పలకలు పట్టుకుపొండి ఈ మధ్య కొత్తగా వచ్చాయి. సరే గాని “ యు ఆర్ ఎ మంకీ” అని రాయండి చెబుతాను 

విష్ణుశర్మ: అంతమాట ఎందుకులేండి, వేరేదేదన్నా చెప్పండి. 

విశ్వనాధ: రాయండీ ఏమి కాదు గానీ 

విష్ణుశర్మ: రాశానండీ 

విశ్వనాధ: ఇదేంటి స్వామీ నేరాయమన్నదేమిటి మీరు రాసిందేమిటి 

విష్ణుశర్మ: “ I am a monkey” అని రాశానండీ, మీరు చెప్పినది రాసి నేను ఉచ్చరిస్తే బావుండదేమోనని 

విశ్వనాధ: ఇప్పుడు మటుకు ఒరిగినదేమిటి, మీరు పలుకకుండా నాచే ఉచ్చరింపజేశారు, మీవి సామాన్యమైన తెలివితేటలు కావండీ, అందుకే మీ పంచతంత్రం ఇంకా చెల్లుబడి అవుతోంది. 

విష్ణుశర్మ: ఏదో మీదయ మేరెట్లా అంటే అట్లా 

విశ్వనాధ: సరే ఇప్పుడు రాయండి. 

విష్ణుశర్మ: “You are a monkey” రాశానండీ 

విశ్వనాధ: ఇక్కడ “You” ఉంది చూశారూ దాన్ని “U” అనే రాస్తే చాలు, అలాగే “are” ని “R” అనే రాస్తే చాలు 

విష్ణుశర్మ: ఇది చాలా అన్యాయం, అక్రమం, కడు శోచనీయం 

విశ్వనాధ: ఏమయిందండీ 

విష్ణుశర్మ: ఏమవుటమేంటండీ ఆనాడు నేను “You” అనే మూడు అక్షరాలకు కు బదులు “U” అని ఒక్క అక్షరం రాస్తే సరిపోతుంది కదా, రెండిటి ఉచ్చారణా ఒకటేకదా అంటే, కాదు కూడదు “U” అనే ఒక్క అక్షరానికి విలువలేదు మూడు అక్షరాలు రాయాలని చెప్పి మమ్మల్ని పిల్లవెధవల్ని చేసిఆడించి ఇప్పుడు మాట మారుస్తారా, ఆడి తప్పుట మీకు మన్ననయా, 

విశ్వనాధ: మీరే కదా ఆంగ్లంలో నూతన పోకడలు నేర్పమంది. నన్నుమటుకు ఏంచెయ్యమన్నారు, తెలుగులో వ్యావహారిక భాషలాగా ఈమధ్య ఆంగ్లంలోకూడా వ్యావహారిక భాషావాదులు బోలెడంతమంది పుట్టుకువచ్చి ఆంగ్లభాషను సరళతరం చేశారు. ఇందులో నా తప్పిదమేమిలేదు. 

విష్ణుశర్మ: అంటే మనం ఎలా ఉచ్చరిస్తే అలా రాస్తే సరిపోతుందంటారా 

విశ్వనాధ: ఆ ఎదుటివాడికి అర్ధమైనంతవరకు, అయ్యా ఈ పూటకు నన్ను విడిచిపెట్టాలి, కార్యాంతరమై బయటకు వెళ్లాలి. 

విష్ణుశర్మ: ఏమిటో ఈ మొదటిరోజు పాఠం అంతా అగమ్యగోచరంగా ఉంది, మరి ఆ Hotal వాడు నన్ను ఎందుకు తప్పుపట్టినట్లు. రేపు పునః దర్శనం చేసుకుంటానండీ. 

సశేషం 

మనవి: విశ్వనాధ వారి “విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” ప్రేరణతో ఈ చిన్న సాహసం చేయటం జరిగింది. ఎటువంటి అభ్యంతరాలున్నా తొలగించబడుతుంది.

4 comments:

  1. బహు బాగుగా నున్నది మీరు వ్రాసిన పారోడీ.

    ReplyDelete
  2. బాగు బాగు. వచ్చినది విష్ణుశర్మగారేనా వారి రూపములో మహేంద్రులవారా అన్న అనుమానం కలుగుతోందండి.

    ReplyDelete