Saturday, November 22, 2014

పక్షుల అఖిలాంధ్ర ప్రధమ మహాసభ

ఉదయభానుడి అరుణారుణకాంతులతో, పక్షుల కిలకిలరావాలతో కొల్లేటి ప్రాంతం కలకలలాడుతోంది. పక్షిబాలలు తల్లిఒడిలో అల్లారుముద్దుగా ఆడుకొంటున్నాయి. పక్షుల అఖిలాంధ్ర మహాసభ సంధర్భంగా రాష్ట్రంలోని పక్షుల సభ్యులందరు కొల్లేరుకు చేరుకున్నారు. ఎంతోకాలంగా స్థిరనివాసం ఏర్పరచుకున్న ఇతర రాష్ట్రాల, దేశాల పక్షుల సభ్యులు కూడా తమకుఏదన్నా లబ్ధిచేకూరక పోతుందాని వారుకూడా చేరుకున్నారు.

ఎక్కడ చూసినా పక్షులు, పిట్టలు. చిన్నవి, పెద్దవి, పొట్టిముక్కువి, పొడుగుముక్కువి, పొట్టికాళ్లవి, పొడుగుకాళ్ళవి, బారెడేసి తోకలున్నవి, అసలు తోకలేలేనివి, పాకేవి, డేకేవి, ఎగురగలిగినవి, ఎగురలేనివి, నడిచేవి, పరుగెత్తేవి, నాట్యంచేసేవి, ఉభయచరాలు, నిశాచరులు, పాడగలిగినవి, అరవగలిగినవి, కూసేవి, మేసేవి, ఒంటికంటివి, కళ్లున్నా చూడలేనివి, రెక్కలున్నవి, ఒకరెక్క గలిగినవి, అసలు రెక్కలేలేనివి, రెక్కలు తెగినవి, తోకలు తెగినవి, గడ్డాలున్నవి, మీసాలుకలవి, కుచ్చు టోపీలు, కుచ్చు తోకలు కలవి, బోసిమెడవి, బొచ్చుమెడవి, పిల్ల పక్షులు, వృద్ధ పక్షులు, ప్రేమ పక్షులు ఇలా నానారకాల పక్షులతో సందడి సందడిగా ఉంది.

వచ్చిన అతిధులకోసం కొల్లేటి కొంగలు చల్లటి నీటిలోంచి వేడివేడి చేపలను బట్టి ఒడ్డున పడేస్తున్నాయి. అసలే చిత్తడిగా ఉండే ఆప్రాంతం ఆ పక్షుల రెట్టలతో మరింత చిత్తడిగా తయారయింది. చెరువులలో స్నానాలు చేసేవాళ్ళుతో, కేవలం ముఖం మాత్రమే నీళ్ళల్లో ముంచి అయిందనిపించేవాళ్ళతో, బుడుంగుమని మునిగితేలేవాళ్లతో, జపాలు చేసేవాళ్లతో ఆ ప్రాంతం పక్షితీర్ధంగా మారిపోయింది.

వచ్చినవాళ్ళకు అన్నీఅందాయోలేదోనని, ఒకపక్క సమయం అయిపోతోందని, సభాఏర్పాట్లు సరిగాఉన్నాయోలేదోనని ఘనతవహించిన కార్యదర్శి శ్రీ కాకిగారు నానా హైరానా పడుతున్నారు. ఒక పక్క “రాష్ట్రపక్షి” ఎన్నిక జరగాలి, అటవీశాఖవారు కేవలం రెండు గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఇంతలో పక్షుల భాష తెలిసిన “మాలోకం” కాకి ఆహ్వానం మీద సభాస్థలికి చేరుకున్నారు. సభ కొద్దిక్షణాల్లో ఆరంభమవుతుందని అందరు సభాస్థలికి చేరుకోవాలని కాకి గట్టిగా అరచి చెప్పింది. పక్షులన్నీ వాటివాటి జాతులవారీగా సభా ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశాలలో కూచున్నాయి. చిలకా, గోరువంకా ఎగురుతూ వచ్చి ముక్కులతో పట్టుకు వచ్చిన ఒక పూలదండను మాలోకంగారి మెడలో జారవిడిచాయి. ఓ అల్లరిచిల్లరిపిల్లపక్షి శుభసూచకంగా మాలోకంగారి నెత్తిమీద రెట్టవేసి మరీవెళ్లింది. పక్షులన్నీ తమతమ రెక్కలను టపటపలాడించి హర్షాతిరేకాన్ని వ్యక్తపరిచాయి.

ఇవాళ చాలా సుదినం. రాష్ట్రపక్షిగా ఎవరుండాలని మీరు నిర్ణయించుకోబోతున్నారు, చివరలో చాలా తీర్మానాలుగూడా ఆమోదించాల్సివుంది, ఇంత క్లిష్టకార్యాన్ని శ్రీ వాయసం గారు నామీద పెట్టారు, అందరుగూడా మీమీ అర్హతలను ప్రకటించుకోవచ్చు, అలాగే నచ్చనివాళ్లు విమర్శించనూవచ్చు, ముందుగా మన పక్షీరాజేంద్రులు అయిన శ్రీ గరుత్మంతులవారిని మాట్లాడవలసినదిగా కోరుతున్నాను, అంటూ మాలోకం లఘుప్రసంగం చేసి కూలబడ్డాడు.

ఆది నుండి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని నా భుజస్కందాలపైన మోస్తున్నవాడిని, పైగా పక్షులకు రాజును, ఇంతకుమించి అర్హతకు ఏమి కావాలి అని గద్దగారు పలికి కూచున్నారు.

వెంటనే కాకి లేచి రాచరికవ్యవస్థ ఏనాడో మంటగలిసింది, ఇది ప్రజాస్వామ్యవ్యవస్థ, నిన్ను రాజుగా ఏనాడూ మేము కొలువలేదు, రాజుగా అనుకుంటున్న నువ్వు చేసిన నిర్వాకమూ ఏమీలేదు, పక్షులకు రాజు అన్నది కవులు చేసిన కల్పన, నువ్వు డేగ కలిసి చిన్నపక్షులను చంపుకుతింటారు, తోటి పక్షులను తినే నువ్వు అనర్హుడవు. ఇహ మా విషయానికివస్తే మేము అన్నిప్రాంతాలలో నిరంతరం అందరికి అందుబాటులో వుంటాము, మానవజాతి నిర్వహించే కర్మలు స్వర్గానికి చేరవేయటానికి సాక్షాత్తు మాకు అధికారం వుంది, పైగా నల్లటిమేను గల్గినదానను, నన్ను ఎన్నుకుంటే మీ అందరకు ఉపయుక్తంగా ఉంటుంది తరువాత మీయిష్టం అని ఇష్టంలేనట్లుగా కూచుంది.

వెనువెంటనే కోయిల లేచి కాకికి మాకు ఆజన్మ శతృత్వం, నన్ను ఎన్నుకోబోయినా ఫరవాలేదు కాకిని గనక ఎన్నుకుంటే మా జాతిని అణగదొక్కేస్తుంది. కాకివన్ని వక్రబుద్ధులు మరియు దొంగ చూపులు, మనుషుల సబ్బుబిళ్ళలు, చెంచాలు తస్కరిస్తుంది, పైగా ఏకాక్షి, రెండుకళ్లూ లేని ధృతరాష్ట్రుడి పాలన భారతయుద్ధానికి దారితీసింది, అందువల్ల మేము అంగీకరించము, చెప్పుకోగూడదుగాని మేము చక్కగా పాడగలము, మంచి నడవడిక గలవాళ్ళము, మేము అయితే సబబుగా ఉంటుందేమోనని మాకు తోస్తోంది అని ముగించింది.

ఇంతలో మాట్లాడటానికి చిలుక లేవబోతుండగా భయంకరమైన గాలి వీచింది, ఓ పెద్దపక్షి ఆ సభాప్రాంగణంలోకి దిగింది, పక్షులన్నీ అల్లల్లాడి పోయాయి. భయంవేసినా తమాయించుకొని గరుత్మంతులవారు ఆ వచ్చిన పక్షి నుద్దేశించి ఓ పక్షీంద్రా ఎవరు మీరు, అసలు మీరు పక్షిజాతికి చెందినవారేనా లేక రెక్కలు ధరించిన మానవమాత్రులా, ఎచటనుండి తమరి రాక అని ప్రశ్నించింది.

హిమాలయాలనుండి నారాక, ఈ విషయం తెలిసి నన్నుగాని ఎన్నుకోబోతారా అని వచ్చాను, నేను “జటాయువును”.

ఆ మాట వింటూవుండటంతోనే కాకి చివాలున లేచి ఉన్న ఒక్క జటాయువును త్రేతాయుగం నాడే రావణాసురులవారు హరీ అనిపించారు. మా ప్రాణానికి నువ్వు ఎక్కడనుండి వూడిబడ్డావు, నిన్ను మేము పక్షిగా అంగీకరించము, మీరు నిష్క్రమిస్తే మేము సంతోషిస్తాము, ప్రసంగాన్ని కొనసాగించమని చిలుకకు సౌంజ్ఞ చేసి కాకి ఓ పక్కకు నిలబడింది.

ఆ మాట కొస్తే కోయిల ఉండటం కాకి గారికి మాత్రం ఇష్టమా, కోయిల కేవలం మూడు నెలలే పాడగలదు, తరువాత మూగదవుతుంది, అలాంటి వారు అనర్హులు, మేమయితే చక్కగా మాట్లాడగలము, పైగా మేము శుకమహర్షి వంశానికి చెందినవారము, శబరి మాగిన పండ్లను గుర్తించటం మాదగ్గరే నేర్చుకుంది, పైగా మేము అందమైన చిలకపచ్చరంగు దేహం కలవారము మా ఎన్నిక ఎవరికి అభ్యంతరముండదని అనుకుంటున్నాను.

ఆ మాటలకు ఓ లకుముకిపిట్ట లేచి నువ్వు అనుకుంటే సరిపోతుందా మేము మటుకు ఎందుకు తగము, మేము అందమైన వాళ్ళమే, మేము ఆకాశంలోంచి చూసి చటాలున నీటిలోకి దూరి లటుక్కున చేపనుబట్టి గబుక్కున పైకివచ్చి గుటుక్కున మింగగలము. ఏ పక్షి ఇలా చేయజాలదు, మమ్ములను ఒక లోహవిహంగ సంస్థ తమ గుర్తుగా పెట్టుకుంది, ఇంతకుమించి ఏమి చెప్పజాలను మీ అభీష్టానుసారం కానిండు అని కూచుంది.

ఓ నెమలి వయ్యారం ఒలకబోస్తూ ఇలా అన్నది, నిన్ను గుర్తుగా పెట్టుకున్నందుకు ఆ సంస్థ దివాళా తీసిన విషయం అందరు ఎరిగినదే. అందువల్ల నువ్వు తగవు. మా విషయానికి వస్తే నేను ఆ శివుడి చిన్న కొమరుని వాహనాన్ని, నేను పురి విప్పితే అందరు పరవశులవుతారు ఈ విషయాన్ని ఓ మారు పరికించండి అని మనవి చేసింది.

ఆ పలుకులకు ఓ పావురాయి నిన్ను ఇదివరనే జాతీయపక్షిగా గుర్తించారు కాన నువ్వు తగవు, అసలు నువ్వు పక్షిజాతిలోకి వస్తావా, నువ్వు ఎగరంగా ఏనాడూ ఎవరము చూడలేదు. కానీ మా విషయం అలాగాదే అలనాడు మేము టపాలు చేరవేశాము, శాంతి కాముకులము, చాలా ఒద్దికగా వుంటాము, ఇంద్రజాల విద్యలో ఉపయోగపడతాము, వాల్మీకి రామాయణ సృష్టికర్తలం మీ ఇష్టం అని తప్పు దొర్లినట్లుగా నాలిక కఱచుకొని చటుక్కున కూచుంది.

ఆ మాటలకు రెండు గువ్వలు చటాలున లేచి పావురం అబద్ధం చెబుతోంది, మేము అసలు కారణభూతులం, పావురం ఉండటానికి వీలులేదు అని కువకువలాడుతూ కూలబడ్డాయి.

అప్పుడే ఆయాస పడుతూ ఆలస్యంగా వచ్చిన ఓ పాలపిట్ట నోరుతెరచేలోపునే, పక్షులన్నీససేమిరా వీల్లేదు, ఈ మధ్యనే నిన్ను కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాష్ట్రపక్షిగా తీర్మానించింది, జోడుపదవులు కుదరవు అని నోరు నొక్కేశాయి.

అసలే తెల్లారింది, నాకు చూపు ఆనటంలేదు నేనేమన్నా పనికివస్తానర్రా అని ఓ గుడ్లగూబ కూయంగానే

అప్పటిదాకా ఓ బొమ్మను చెక్కుతున్న వడ్రంగిపిట్ట ముక్కు టకటకలాడించి నీ తలకాయ పనికివస్తావు, అసలు నువ్వెందుకొచ్చావీటికి, నువ్వుత్త అపశకునప్పక్షివి, నీ గాత్రం వింటేనే కుంభకర్ణుడు గూడా లేచికూచుంటాడే, నువ్వు వాలిన కొంప కొల్లేరే, ముందు నడుబయటకు అని ముక్కుతో పొడిచి తరిమేసింది.

కొక్కురోమంటూ నేను సమస్త ప్రజానీకాన్ని మేలుకొలుపుతాను, రాజసం మా పుట్టిల్లు మా అర్హత గమనించగలరు అని కోడి నొక్కి వక్కాణించింది.

నీళ్ళల్లోంచి అప్పుడే ఒడ్డునపడ్డ ఓ బాతు నాకు తెలిసినంతవరకు కోడి జాతికి చెందినవి అసలు పక్షులు గావు, వాటికి నడవటం తప్ప ఎగరటం చేతకాదు, అవి పకోడీ చేసుకోటానికి తప్ప ఎందుకుపనికి రావు, దానికంటే ఉభయచరాన్ని నేనే సబబనుకుంటున్నాను అని అనేసి నీళ్ళల్లోకి మళ్ళీ చక్కాబోయింది.

తరువాత ఓ కొంగ లేచి మానవులు జపం చేయటం నావద్దే నేర్చుకున్నారు, నాది ధవళవన్నె శరీరం నేనేమన్నా తగుదునంటారా అంటూ విన్నవించింది.

ఆ సరికి ఓ మైనాకపక్షి లేచి నీవన్నీ దొంగజపాలు, నిన్ను చూచి మానవులు అలాగే తయారయ్యారు, చెప్పేదొకటి చేసేదొకటి నేను ఛస్తే పడనివ్వను అని కూర్చుంది.

ఓ పొడుగుకాళ్ళ కొంగ లేచి మాట్లాడబోయెంతలో, మిగతా పక్షులన్నీ నువ్వు వలసపక్షివి, ఇతర దేశాల పక్షులు పదవిలో కొనసాగటానికి వీలులేదు అని ప్రతిఘటించాయి.

సమయాభావం అవటంతో కాకి లేచి, మనం ఏకాభిప్రాయానికి రాలేకపోయాము, మనలో ఐక్యత లేకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయి, ఇది మనకు మన్నన కాదు, కాన మాలోకంగారు ఎవరినాన్నా ప్రతిపాదిస్తే మనం అందరం సమర్ధిద్దాము, అటు పిమ్మట తీర్మానాలు ఆమోదించాల్సి వుంది, సభ్యులు అప్పటివరకూ వేచి ఉండాలి అని చెప్పి పక్కకు నిలబడింది.

మాలోకం లేచి, మీ సంఘీభావానికి అచ్చెరువేస్తోంది, ఈ సమావేశానికి పిచ్చుక, భరద్వాజపక్షి, చకోరపక్షి, ఉష్ట్రపక్షి, బట్టమేకపిట్ట, జెముడుకాకి, ఈముపక్షి, హంస, రాబందు రాలేకపోయినాయి. నాకుమటుకునాకు మీఅందరిలోకి చిన్నపక్షి పిచ్చుకజాతి కనుమరుగైపోతోంది, అందువల్ల పిచ్చుకను ఓ అయిదు సంవత్సరాలు రాష్ట్రపక్షిగా ప్రభుత్వం గుర్తించాలని మనవి చేస్తున్నాను. వెంటనే పక్షులన్నీ రెక్కలు అల్లల్లార్చి రెండుమాట్లు రెక్కలు పైకెత్తి తమ ఏకీభావాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పుడు కోయిలగారు తీర్మానాలను చదువుతారు అని మాలోకం ముగించాడు.

కోయిల ఇలా చదవటం ఆరంభించింది.

రాష్ట్రపక్షిగా ఎన్నికైనపక్షి ఇతరపక్షుల అభివృద్ధికి పాటుపడాలి, మిగతా పక్షుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంచెయ్యాలి.

ఒకే పక్షి ఎల్లకాలము రాష్ట్రపక్షిగా ఉండకూడదు. దానివల్ల మిగతా పక్షులకు అవకాశం లబించదు. వారివంశంవారే ఎల్లకాలము వుంటే మిగతా పక్షిజాతులు అంతరించిపోతాయి. అందుకని రాష్ట్రపక్షి పదవి ఐదు సంవత్సరాలకు మించకూడదు. రాష్ట్రపక్షి పదవి లాగానే నగరపక్షి, మండలపక్షి, తాలూకాపక్షి, గ్రామపక్షి పదవులు కల్పించాలి. దానివల్ల ఆయా ప్రాంతాల్లో వుండే స్థానిక పక్షులకు అవకాశం దొరుకుతుంది.

రాష్ట్రపక్షి చిత్రములు, శిలావిగ్రహములు బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు గావించాలి. రాష్ట్రపక్షి గ్రామపర్యటనకు వచ్చినపుడు స్థానిక అధికారులు సాదరంగా ఆహ్వానించి అతిధిమర్యాదలు జరపాలి.

రాష్ట్రపక్షిని ఎవరన్నా చంపినా, హానికలిగించినా, పంజరంలో నిర్భందించినా వారికి యావజ్జీవ (ఆ పక్షి జీవితకాలమంత) కారాగార శిక్ష విధించాలి.

జంతుప్రదర్శన శాలల్లో పక్షులకు యాభైశాతం స్థలం కేటాయించాలి. పక్షికారుణ్య సంఘాలు, పక్షిసంవర్ధక శాఖ ఏర్పాటు చెయ్యాలి. పక్షివైద్యశాలలు కల్పించాలి. పక్షివైద్యవృత్తిని ప్రోత్సహించాలి. వృద్ధపక్షులకు అనాధశరణాలయాలు ఏర్పాటు చెయ్యాలి.

విద్యుత్ తీగలు పక్షులకు హాని కలిగిస్తున్నాయి కాబట్టి వాటిని తక్షణమే తొలగించి భూగర్భంలో వేసుకోవాలి. విమానాలు రాత్రిపూట సంచరించాలి. గాలిపటాలు ఎగురవెయ్యటం నిరోధించాలి.

ప్రతి గృహస్థుడు వారి ఇంటి ముంగిట మానెడో, సోలెడో అధమపక్షం గిద్దడో ధాన్యపుగింజలు పక్షులకోసం ఆహారంగా ఏర్పాటుచేయాలి. దానితో పాటు కాసిని మంచినీళ్ళు, శాఖాహారులకోసం కొన్నిపళ్ళూ, మాంసాహారులకోసం కొద్దిపాటి మాంసం ముక్కలు ఉంచాలి. పిల్లపక్షులూ, వృద్ధపక్షులూ ఈ గింజలూ అవి తిని హరాయించుకోలేక పోతున్నాయి కాబట్టి వాటిని కొంచెం ఉడకబెట్టి జావలాగా చేస్తే బావుంటుంది. ఇలా పక్షుల అభివృద్దికి పెట్టే ఖర్చును ఆదాయపుపన్ను నుండి తగ్గించుకొనేవిధంగా వెసులుబాటు కల్పించాలి.

రైతులు పంటలకు పురుగుమందులు వాడటంవల్ల పక్షులకు కడుపునెప్పి సమస్యలు తలయెత్తుతున్నాయి. అందువల్ల రైతులు వాటిని వాడటం మానుకోవాలి. కొత్తపంట ఇంటికి వచ్చినపుడు ధాన్యపు కంకులు ఇంటి ముంగిట తప్పనిసరిగా వ్రేలాడతీయాలి.

ప్రజలు దేవాలయాలకు వెళ్లినప్పుడు నవధాన్యాలు కూడా పట్టుకెళ్లి నాలుగు దిక్కులా జల్లితే పక్షులకు ఆహారంగాను, వారికి పుణ్యము, పురుషార్ధము కలుగుతాయి.

వలసపక్షులకు గుర్తింపుపత్రాలు ఇవ్వాలి. పక్షుల అభివృద్ధికి పాటుపడిన వారికి రాయితీలు కల్పించాలి. చెట్లు పెంచేవారిని ప్రోత్సహించి, చెట్లు నరికేవారిని శిక్షించాలి. పక్షులకోసం ప్రత్యేక అభయారణ్యాలు ఏర్పాటు చేయాలి అని ముగించింది.

కాకి లేచి చివరగా నాదొక ప్రతిపాదన, ఇదివరలో ప్రజలలో పదిశాతంమంది ఎంగిలిచెయ్యికూడా విదిలించేవారుకారు, కానీ ఇప్పుడు అది తొంభైశాతానికి పెరిగిపోయింది, ఆరోగ్యానికి మంచిదికాదు అన్నాగాని చెంచాలతో తింటున్నారు, ఇళ్ళల్లోనే భోజనానంతరం చేతులుకడుక్కుంటున్నారు, దానివల్ల మాకు మెతుకు పుట్టటంలేదు, అందువల్ల కనీసం వివాహ సంధర్భంలోనైనా అందరు (అధమపక్షం వధూవరులైనా) భోజనానంతరం బహిరంగప్రదేశంలో చేతులువిదల్చటం అన్నది ఒక తంతుగా నిర్వహిస్తే బావుంటుందని మా అభిమతం.

చివరిమాట, మాలోకంగారు పక్షుల సుగుణాలన్నీ విశదీకరిస్తూ ఒక ప్రతిని తయారుసేసి, వాటికి ఈ ప్రతిపాదించిన తీర్మానాలను జోడించి ప్రభుత్వానికి అందజేసి, ప్రజలందరికి తెలియజేసేటట్లు చేసి, రాష్ట్రపక్షి ఎన్నికకు సహకరించాలని మా మనసావాచాకర్మణా కోరుకుంటున్నాము. ఈ సభ ఇంతటితో ముగి............

దూరంగా తుపాకిచప్పుడు, పక్షులన్నీ చెట్టుకొకళ్లుగా చెల్లాచెదురయ్యాయి.

No comments:

Post a Comment