Wednesday, November 5, 2014

రేడియో ప్రసారాలు రికార్డు చెయ్యటం ఎలా

ఏకాంబరం: యురేకా యురేకా 
చిన్నక్క: పిలిచావా ఏకాంబరం, చిన్నక్కా చిన్నక్కా అని వినబడితేను
ఏకాంబరం: లేదుగాని సమయానికొచ్చావు, రా కూర్చో నీతో చాలా విషయాలు మాట్లాడాలి 
చిన్నక్క: ఏమిటి ఈ రేడియో కంప్యూటర్ ముందేసుకు కూర్చున్నావు 
ఏకాంబరం: అదే మరి, రేడియో ప్రసారాలు ఎలా రికార్డు చేయాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే తళుక్కున ఆలోచన వచ్చి యురేకా అని అరచాను నీవు వచ్చావు 
చిన్నక్క: ఏమో అనుకున్నాను ఏకాంబరం, నీకు వయసు మీదబడ్డకొద్దీ బుర్ర పనిచేస్తున్నట్లు లేదు 
ఏకాంబరం: అంతమాట అన్నావేం చిన్నక్కా 
చిన్నక్క: లేకపోతేమరి రేడియోలో వచ్చేదాన్ని రికార్డు చేయటం పెద్ద బ్రహ్మవిద్యా ఏమన్నానా 
ఏకాంబరం: సరే, నువ్వు ఎలా చేస్తావో చెప్పు చూద్దాం 
చిన్నక్క: ఏముంది టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టి నొక్కితే అదే రికార్డు అవుతుంది 
ఏకాంబరం: ఏది ఒక క్యాసెట్ పట్టుకురా చూద్దాము
చిన్నక్క: నిజమే ఏకాంబరం అసలు ఇప్పుడు క్యాసెట్లే రావట్లేదు ఎలామరి 
ఏకాంబరం: అద్గదీ ఆ మాటకొస్తే టేప్ రికార్డర్లే ఎవరు వాడటం లేదు 
చిన్నక్క: నిజమే సుమా ఈ రెండు లేకుండా ఎలా సాధ్యం, అసలే ఈ టీవిలు, సెల్ ఫోన్లు వచ్చాక రేడియో వినేవాళ్లే కరువయ్యారు. 
ఏకాంబరం: అదేంటక్కా ఎఫ్. ఎం. రేడియో వినట్లేదా
చిన్నక్క: ఏమి ఎఫ్. ఎం. రేడియోనో, లబలబమంటూ ఒకటే గోల, పాటలూనూ
ఏకాంబరం: తరం మారుతోంది తెలియట్లా 
చిన్నక్క: ఏమో గాని ఆ రికార్డు చేయటం ఏమిటో తొందరగా చెప్పు బాబూ అవతల బోలెడంత పనుంది
ఏకాంబరం: ఆ ఏముంది ముందుగా ఆ రేడియోకి external స్పీకర్స్ లేక ఇయర్ ఫోన్ లేక హెడ్ ఫోన్ పెట్టుకొనే అవకాశం ఉండాలి. 
చిన్నక్క: ఎందుకు దాంట్లోంకి వైరు గుచ్చి కంప్యూటర్ కి కలపటానికా? 
ఏకాంబరం: చూశావా నాతో మాట్లాడుతుంటేనే నీకు ఎంత తెలివితేటలు కలుగుతున్నాయో 
చిన్నక్క: అంత సంబడం లేదులే గాని ఎలాంటి వైరు గావాలో చూపెట్టు
ఏకాంబరం: రేడియోకి external స్పీకర్స్ పెట్టుకొనే అవకాశం ఉంటే ఇలాంటి వైరు, 




ఇయర్ ఫోన్ లేక హెడ్ ఫోన్ పెట్టుకొనే అవకాశం ఇలాంటి వైరు కావాలి. 



చిన్నక్క: మరి కంప్యూటర్ కి ఎక్కడ అనుసంధానం చేయాలి 
ఏకాంబరం: ఇదిగో కంప్యూటర్ వెనకాతల ఆడియో పోర్ట్ లో ఈ లైన్-ఇన్ దాంట్లో గుచ్చాలి 




చిన్నక్క: అదేమిటి స్క్రీన్ మీద ఏదో వచ్చింది 





ఏకాంబరం: అదే మనం లైన్-ఇన్ జాక్ పెట్టామని గుర్తు చేస్తోంది, దాని మీద ఒక క్లిక్ చేస్తే సరి 
చిన్నక్క: ఇలా రాకపోతే 
ఏకాంబరం: ఆడియో కంట్రోల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెయ్యాలి
చిన్నక్క: అప్పుడే కంప్యూటర్ లో రేడియో వినబడుతోందే 
ఏకాంబరం: రేడియోని కంప్యూటర్ కి తగినంత దూరంలో పెట్టాలి లేకపోతే విద్యుత్ అయస్కాంత తరంగాలవల్ల రేడియో బుర్ బుర్ అంటుంది 
చిన్నక్క: అవును మరి రికార్డు చేయటానికి అదేదో హార్డ్వేర్ కావద్దు
ఏకాంబరం: దాన్ని software అంటారు. “Audacity” అన్న ఫ్రీ software దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని install చేసుకోవాలి 
చిన్నక్క: ఎలా రికార్డు చెయ్యాలి 
ఏకాంబరం: ఈ “రెడ్ కలర్” బటన్ నొక్కితే చాలు, ఆపాలంటే “ఎల్లో కలర్” బటన్ నొక్కాలి. బయటనుంచి రికార్డు చేస్తుంటే “లైన్-ఇన్ మోడ్” సెలెక్ట్ చెయ్యాలి. కంప్యూటర్ లోంచే రికార్డు చేస్తుంటే “స్టీరియో మిక్స్” మోడ్ సెలక్ట్ చెయ్యాలి, అక్కరలేదనుకున్న రికార్డు మొదట్లోగాని, చివర్లోగాని అదిగో ఆ పైన కనిపిస్తున్న కత్తెరతో కట్ చేస్తే సరి


 

చిన్నక్క: అవును అదేదో m p 3 అంటారు 
ఏకాంబరం: ఉండు నీకు ఒకటే తొందర, ఇక్కడ చూశావా దీన్ని ఇలా “8000” లో రికార్డు చేసేటప్పుడు పెట్టుకుంటే చిన్న ఫైల్ గా రికార్డు చేసుకోవచ్చు





చిన్నక్క: నేనడిగింది మటుకు చెప్పలా 
ఏకాంబరం: ఇదిగో ఇలా ఫైల్లోకి వెళ్ళి “ఎక్స్ పోర్ట్” నొక్కి, ఫైలుకు పేరు పెట్టుకొని, ఎక్కడ సేవ్ చెయ్యాలో ఆజ్ఞ ఇస్తే, అక్కడ m p3 ఫార్మాట్ లో సేవ్ అవుతుంది 







చిన్నక్క: నీకు తెలివితేటలు కొంచెం కనబడుతున్నాయి కానీ ముందుచూపు లేదు ఏకాంబరం 
ఏకాంబరం: అదేంటి చిన్నక్కా అలా అన్నావు, మెచ్చుకుంటావనుకెంటే 
చిన్నక్క: లేకపోతే, అసలు కరెంటే ఉండట్లేదు, నీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే 
ఏకాంబరం: నువ్వు ఇలాంటి మెలిక ఏదో పెడతావని ముందే వూహించా 
చిన్నక్క: కరెంటు లేకపోతే ఎలా రికార్డు చేస్తావు చెప్పు 
ఏకాంబరం: ఇదిగో ఈ రేడియో చూశావా 




చిన్నక్క: ఎంత ముద్దొస్తోందో గున్న ఏనుగులా 
ఏకాంబరం: దీన్ని చూశావా 



చిన్నక్క: ఇదెందుకు 
ఏకాంబరం: దీన్ని ఈ వైరుతో రేడియోకి కలిపి రికార్డు చేస్తే డైరెక్ట్ గా m p3 ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవుతుంది. తరువాత దీన్నుంచి కంప్యూటర్ కి ఎక్కించటమే తరువాయి 





చిన్నక్క: బావుంది ఏకాంబరం, ఒక సందేహం గోతికాడ నక్కలా రేడియో ముందు కూర్చోవద్దు ఎప్పుడు ఏమి వస్తుందా అని 
ఏకాంబరం: అదేమిటి చిన్నక్కా అలా అంటావు, మన ఆకాశవాణివారు వారు పడుకోబోయే ముందు, మనం లేవబోయే ముందు ప్రసార విశేషాలు చెబుతారు గదా, దాన్ని బట్టి మనకు నచ్చిన కార్యక్రమం వీలైతే రికార్డు చేసుకోవచ్చు 
చిన్నక్క: నువ్వు చెప్పిన ప్రకారం ఈ బుల్లి రేడియోని ఎక్కడకు కావాలంటే అక్కడకు పట్టుకెళ్లి ఏ టైమ్ లో కావాలంటే ఆ టైమ్ లో కూడా రికార్డు చేసుకోవచ్చు అంటావు
ఏకాంబరం: అంతేగదా మరి 
చిన్నక్క: యురేకా ------------- యురేకా ------------ యురే
ఏకాంబరం: అదేమిటి చిన్నక్క అలా చెప్పా పెట్టకుండా పరుగెట్టుకుంటూ వెళ్లిపోయింది. తనకు కూడా ఏదన్నా స్ఫురించిందా ఏమిటి. కొంపతీసి సెల్ ఫోన్ పట్టుకెళ్లి ఏ రేడియోకో, టీవికో అనుసంధానం చేయదుకదా.


ఆకాశవాణి “కార్మికుల కార్యక్రమం” లో చిన్నక్క, ఏకాంబరం అంటూ వచ్చేవారు. గతంలో రేడియో ప్రసారాలు విన్నవాళ్లకు వాళ్ళ స్వరాలు గుర్తుండే ఉంటాయి. వాళ్ళను పాత్రధారులుగా చేసి “రేడియో ప్రసారాలు ఎలా రికార్డు చెయ్యాలి” అన్న చిన్నపాటి సృజనాత్మక వ్యాసం రాయటం జరిగింది. బహుశా కొందరికి ఎలా రికార్డు చేయాలో తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఆకాశవాణి వారి “పాతబంగారం” అంతర్జాలంలో గుట్టుగా చేతులుమారుతోంది. మరింతమంది రేడియో ప్రసారాలు రికార్డు చేసి అందరికి అందిస్తే బావుంటుంది. అంతర్జాలంలో వుంటే ఏ దేశంలో వున్నా, ఏ సందర్భం లోనైనా వినవచ్చు.

No comments:

Post a Comment