Sunday, December 23, 2012

సినిమాలో ఒక పాట – రికార్డులో ఇంకో పాట

1943లో వచ్చిన నాగయ్య గారి సంగీత ప్రధానమైన పాటల సినిమా భాగ్యలక్ష్మి. ఇందులో “వలచీ వచ్చీ” అనే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి నవరాగమాలికా వర్ణం భీమవరపు నరసింహారావు గారి సంగీతంలో కానవస్తుంది. ఇది బృందగానం. టంగుటూరి సూర్యకుమారి గారితో పాటు ఇతరులు, నాగయ్య గారు కొద్దిగా గొంతు కలుపుతారు. ఈ పాట చివరిలో కొంచెంసేపు జలతరంగిణి మీద వినవచ్చే సంగీతం వీనుల విందుగా వుంటుంది. వాయిస్తున్నప్పుడే రికార్డు చేశారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ పాటను కింద చూడండి. ఈ పాటలో సూర్యకుమారి గారు టై కట్టుకొని కనబడతారు. ఆడవాళ్ళు టై కట్టుకోవటం అందునా ఆ కాలంలో అరుదైన విషయం.  

                      పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్




ఇదివరలో LP రికార్డ్స్  కోసమని ఆ పాటలను మళ్ళీ పాడించేవారని అంటారు. 1948లో వచ్చిన బాలరాజు సినిమాలో చెలియా కానరావా అనే పాటను సినిమాలో  అక్కినేని నాగేశ్వర రావు గారు, రికార్డ్ కోసమని ఘంటసాల గారు పాడారని,  నాగేశ్వరరావు గారు చెప్పారని  రంగారావు గారు పేర్కొన్నారు. 1986లో వి. ఎ. కె. రంగారావు గారి నేతృత్వంలో వచ్చిన అలనాటి అందాలు లో పైన కనువిందుచేసిన ఈ పాట ఒక్క సూర్యకుమారి గారి గళంలోనే కింద వినవస్తుంది.   అధ్బుతమైన, సంగీతప్రధానమైన పాట. ఈ పాటకు ఆడియో సహకారం oldtelugusongs.com


No comments:

Post a Comment