Wednesday, December 26, 2012

మార్జాలోపాఖ్యానము అనబడే పిల్లి స్తుతి కదంబము

అల్లన తక్కుచు, తారుచు,
మెల్లన మ్యా వనుచు నను సమీపించుటకున్
చెల్లునె యెవ్వరికిని? నా
ఇల్లాలికి నీకు తప్ప ఇలలో? పిల్లీ ;


 అన్నారు బోయి భీమ కవి గారు.

బాల కృష్ణుడు వెన్నను దొంగిలించటం మొదట పిల్లిని చూసే నేర్చుకున్నాడని విజ్ఞులైన వాళ్లెవరైనా ఒప్పుకుంటారు. చప్పుడు చేయకుండా ఉట్టిని గట్టిన వెన్నను మాయం చెయ్యటం గోపాలుడి తరము గాక మరెవరితరము. బాల కృష్ణుడు చేస్తే భజించుదురుగాని పిల్లి గారు చేస్తే దండించుదురా. ఏమి వైచిత్రి.

ఏకాగ్రత విషయాన్నే తీసుకోండి, పిల్లి ఎంత ఏకాగ్రతను కనబరుస్తుంది. మహర్షులకు ఖఠోర మైన తపస్సు ఎలా చెయ్యాలి అనే సూక్ష్మ రహస్యాన్ని ఎవరు భోదించారు అనుకున్నారు. మన మార్జాలం గారే. ఎవరు వచ్చినా గాని కదలక, మరలక మనం అనుకున్న దానిమీదే దృష్టి నిలపాలి అనే సత్యాన్ని పిల్లి నేర్పించింది.

పిల్లలు  పిల్లి నుంచే గదా ఏడవటం నేర్చుకుంది. అసలు పిల్లులు ఏడుస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారేమో అని తల్లడిల్లే తల్లులున్నారు. పిల్లలు ఎడిస్తే సముదాయిస్తారా, పిల్లులు ఎడిస్తేనేమన్నా కసురుకుంటారా. ఎంతటి భిన్న మనస్కుడు మానవుడు. పిల్లలు గారాము, మారాము కూడా పిల్లి నుంచే గ్రహించారు. పిల్లులు చూడండి ఎంత గారాము చేస్తూ మనలను రాసుకుంటూ పూసుకుంటూ మనచుట్టూ తిరుగుతూ మనం పెరుగన్నం తింటుంటే దాంట్లో సగం కొట్టేస్తాయో. పిల్లలు గూడా అల్లాగే మారాము చేసే వాళ్ళ కోర్కెలు నెరవేర్చు కుంటారు. అయినా పి”ల్ల”లు కంటే పి”ల్లు”లు ఎక్కువయినవని, ఎందుకంటే వాటికి ఒక కొమ్ము అధికమని పుచ్చా పూర్ణానందం గారు చమత్కరించారు.

న్యాయశాస్త్రాన్ని పిల్లుల నుండే మనం అభ్యసించాము. రెండు కోతుల మధ్య రొట్టె పంపకం ఎంత న్యాయ సమ్మతంగా ప్రదర్శించింది. ఈ రోజుల్లో ఆస్తి పంపకాల విషయమై ఏ పెద్దమనిషినన్నా సంప్రదిస్తే ఇద్దరికీ కాకుండా చేసి వారు చూపిస్తున్నది మార్జాల న్యాయమేగదా.

పిల్లల భద్రత విషయానికి వస్తే పిల్లి తొమ్మిదిళ్ళు పిల్లలను తిప్పుతుందని చులకనగా చూస్తాముగాని, ఆదిమానవులు కూడా తమ పిల్లలను అడవి జంతువుల బారి నుండి కాపాడుకోవట మెలాగో పిల్లిని చూసి గ్రహించి పని గట్టుకొని మరీ తొమ్మిది గుహలూ త్రిప్పేవారుట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అప్పులుచేసి ఎగొట్టేవారు తమ పిల్లలతో తొమ్మిది అద్దె కొంపలు మారితే మటుకు ఫరవాలేదు.

యోగులు యోగ విద్యా రహస్యాన్ని పిల్లిని చూసి వ్రాశారు. పిల్లిని చూడండి అరమోడ్పు కన్నులతో చుట్టూ జరిగేదానిని గ్రహిస్తున్నా కానీ గ్రహించనట్లుగా ధ్యానంలో నిమగ్నమై వుంటుంది. యోగా అంటే మనస్సును నిలకడ చేయటం అన్న విషయానిని మర్చిపోయి వెర్రి మొర్రి ఆసనాలు వేయటం పరిపాటి అయిపోయింది. మనం కూడా మార్జాలం మాదిరిగా ఆ మాత్రం ధ్యానంలో నిలకడ ప్రదర్శిస్తే ఎప్పుడో యోగిపుంగవుల మయి వుండే వాళ్ళము.

ఆ మాటకొస్తే మన పూర్వీకులు వేదాంత సారాన్ని మార్జాలంనుండి సంగ్రహించారు. ఎలుకల్లాగా, చీమల్లాగా పిల్లులు ఆహారాన్ని కలుగుల్లోను, బొరియల్లోనూ దాచుకోవు. ఏది వెంట రాదని, ఏది శాశ్వతం కాదని, వర్తమానంలో జీవించమని పిల్లులు పని గట్టుకొని భోదిస్తుంటే, అది కాదని ఆశాశ్వతమైన భోగాలకోసం మనం వెంపర్లాడుతున్నాము.

ఎంత ఎత్తు మీద నుంచి కింద పడినా గాని దెబ్బ తగలకుండా భూమికి దిగటం ఎలా అన్న నగ్న సత్యాన్ని శాస్త్రజ్ఞులు పిల్లిని చూసి అవగతం చేసుకున్నారు. దేహాన్ని తేలిక చేసుకోవటం ఎలాగో పిల్లి బోధిస్తోంది. ఈ పరిజ్ఞానాన్నే మనవాళ్లు అంతరిక్ష పరిశోధనలలో వాడుకుంటూ ఆహా ఓహో అని జబ్బలు చరుచుకుంటున్నారు.

పిల్లి ఎంతో ముందు చూపుగల జంతువు. తన ఉనికిని కాపాడుగోటానికి పెద్దపులి మావయ్యకు అన్నీ నేర్పించి తాను మటుకు చెట్టెక్కి కూర్చుంది. పెద్దపులి మొన్న మొన్నటి దాకా గూడా ప్రయతిస్తునే వుంది. ఆ మాత్రం ముందు చూపు మనకు లేక అన్నివిషయాలు అందరికీ వెలిబుచ్చి అభాసుపాలవుతున్నాము.

గోడమీది పిల్లివాటం అని అవహేళన చేస్తాము కానీ మన రాజకీయ నాయకులు పిల్లిని చూసి కాదుటండీ ఇన్ని పిల్లి మొగ్గలు వేయటం నేర్చుకుంది.

కర్మ సిద్ధాంతం మన నుదుటన రాసి వుంటే, అదికాదని పిల్లి ఎదురొచ్చిందని అభం శుభం తెలియని పిల్లి మీద అపనిందలు మోపటం, అభాండాలు వేయటం ఎంత శోచనీయం.

ఆహా ఓహో ఏమి నడకండి అంటూ మన లాలనామణులను చూసి మెచ్చుకుంటాము. ఈ పిల్లి నడకలు ఎవరినిచూసి నేర్చుకున్నారంటే మాట్లాడరెం. ఇంకెవరి నుండి పిల్లి నుండి గాక. పిల్లి నడకలో ఎంత సోయగముంది.

పిల్లి కళ్ళు అంటూ చులకనగా చూస్తారు గాని, పిల్లి లాగా చీకటిలో చూడగలరా మీరు. పిల్లి కళ్ళు వున్న వాళ్ళు ఆమాటకొస్తే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. చీకటిలోకి చూడటం అంటే నీ లోపలికి నీవు చూసుకుంటూ అజ్ఞానపు పొరలు తొలగించుకోవటమన్న బ్రహ్మ సూక్ష్మం. పిల్లి చీకటిలో ఎలా చూడ గలుగు తొందా అని ఆలోచించి, చించి ఈ నాటికి మనవాళ్లు చీకటిలో చూడగలిగే పరికరాలను కనుగొన్నారు.

అసలు శుచి, శుభ్రత పిల్లులను చూసి గమనించాలి. పిల్లి ఎప్పుడూ కడిగిన ముత్యంలా వుంటుంది. మిగిలిన జంతువుల్లాగా అసభ్యంగా ఎప్పుడన్నా పిల్లిని చూశామా మనం. ఆ మాట కొస్తే మనలో చాలా మంది పిల్లి పాటించినంత శుభ్రత కూడా పాటించరు.

మనం నిత్యం కొలిచే దేవుళ్ళు పిల్లికి తగని అన్యాయం చేశారు. ఎందుకూ కొరగాని జంతువులను, పక్షులను వాహనాలుగా ఎంచుకున్నారు. పేరు పేరునా ఎందుకుగాని పిల్లి అంటేనే భయపడే అర్భకపు మూషికం మన బొజ్జ గణపయ్యకు వాహనామా. పిల్లి ఏం తక్కువ చేసిందని. 

పిల్లికి ఒకసారి కోపం వచ్చి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఘోర తపస్సంటే మన లాగా అనుకున్నారా, అసలే పిల్లాయే, అయిదు ఘడియల్లో బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మానవుల నుండి తనకు రక్షణ కావాలని కోరింది. బ్రహ్మగారు ముందుచూపుతో, నిన్ను సంహరించినవారు నీఅంత బంగారపు పిల్లిని దాన మొసంగినగాని ఆపాపానికి పరిహారం లేదని చెప్పేసి అంతర్దానమయ్యారు. ఇది జరిగిచచ్చే విషయం కాదని మానవులు పిల్లిని వదిలి ఎలుకల మీద పడ్డారు. చూశారా మరి పిల్లి తెలివితేటలు. తన జాతి మనుగడను దృష్టిలోపెట్టుకొని వరం కోరింది. మనం అయితే స్వలాభం కోసం చూసుకుంటాము.

వెయ్యి మాటలేల అన్నిటా పిల్లియే మనకు ఆదర్శం, మార్గదర్శి, జీవన్ముక్తికి సోపానం.

 ఫ్రేరణ: హాస్యానికి నిర్వచనం చెప్పిన మునిమాణిక్యం వారి “మన హాస్యము” మరియు పుచ్చా పూర్ణానందం గారి “మీసాల సొగసులు”. 

పిల్లి మీద పుచ్చా పూర్ణానందం గారు వ్రాసి రేడియో కోసం చదివిన హాస్యప్రసంగ వ్యాసం “పిల్లి ఎదురొచ్చింది”. ఆసక్తి వున్నవారు ఈ క్రింద వున్న లంకె మీద నొక్కి అక్కడ “ఆకాశవాణి – ఇతర” అన్న గదిలోకి వెళితే మీకు పిల్లి ఎదురొస్తుంది. 
http://www.maganti.org/ 

3 comments:

  1. “ఆకాశవాణి – ఇతర” అన్న గదిలోకి వెళితే మీకు పిల్లి ఎదురొస్తుంది.
    ఈ వాక్యం చదివి ఆకాశవాణి కేంద్రంలో పిల్లులు ఎప్పుడు పెంచుతున్నారు? అని అనుకున్నాను :D :D
    బాగుంది మార్జాలోపాఖ్యానము.

    ReplyDelete
  2. హ..హ.. పిల్లి కూతలను చూసి కారుకూతలు కూయడమేగాని, ఇంతకుముందు పిల్లి గారి గొప్పతనం గుర్తించలేదు. మీ టపాని లామినేట్ చేసి పిల్లి మెడలో వెయ్యాలి.

    ReplyDelete
  3. నేనొప్పుకోను. పిల్లులకన్నా పందులు గొప్పవి. కావాలంటే చూడండిక్కడ: పందిరాజము మరియు ఇక్కడ: పందిరాజము రిటర్న్స్

    ReplyDelete